Friday, November 22, 2024

మొన్న రైతుబంధు.. నిన్న పెన్షన్ రికవరీ గుబులు రేపుతున్న ప్రభుత్వ వైఖరి

నారద వర్తమాన సమాచారం

తెలంగాణ సర్కార్ రేపిన రికవరీ రచ్చ..
బడా బాబుల సంగతేంటంటూ నిలదీత

అనర్హులను ఎంపిక చేసిన అధికారులపైనా చర్యలుంటాయా?
మొన్న రైతుబంధు.. నిన్న పెన్షన్ రికవరీ
గుబులు రేపుతున్న ప్రభుత్వ వైఖరి

తెలంగాణ

గత బీఆరెస్ ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ల ఏర్పాటుతో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా పథకాల లబ్ధిదారుల నుంచి కూడా రికవరీ చర్యలకు పూనుకుంటున్న తీరు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వ్యవసాయేతర భూమికి రైతుబంధు సహాయం పొందిన వ్యక్తి నుంచి డబ్బుల రికవరీకి నోటీసులిచ్చిన ప్రభుత్వం, అక్రమంగా ఆసరా పెన్షన్ పొందారంటూ ఒంటరి వృద్ధ మహిళ నుంచి కూడా పెన్షన్ మొత్తాన్ని రికవరీకి ఆదేశించడం సంచలనంగా మారింది. ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరిరెడ్డికి సంబంధించి 30ఎకరాల వ్యవసాయ భూమికి 16.80లక్షల రైతుబంధు పంపిణీ కాగా, దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద లబ్ధిదారుడికి నోటీసులిచ్చారు. ఇదే తరహాలో రాష్ట్రంలో 12విడతల్లో పంపిణీ జరిగిన 80,458 కోట్ల రైతుబంధులో సాగులో లేని కొండలు, రోడ్లు, లేఅవుట్లు ఉన్న భూములకు 25,672కోట్లు ఇచ్చినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం వివరాలు పరిశీలిస్తే.. ఈ లెక్కన అనర్హుల జాబితా చాంతాడంత ఉండనుంది. అందులో బడా లియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు సైతం ఉన్నారు. మరి వారందరి నుంచి రైతుబంధు నిధుల రికవరీ సాధ్యమా అంటే అసాధ్యమేనంటున్నారు నిపుణులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80ఏళ్ల పక్షపాత వ్యాధిగ్రస్తురాలైన ఒంటరి వృద్ధ మహిళ దాసరి మల్లమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన రూ. 1,72,928లను తిరిగి కట్టాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ వ్యవహారం సైతం రాజకీయంగా దూమారం రేపింది. ప్రతిపక్ష బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అదనుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పెన్షన్ 4వేలకు పెంచుతామని చెప్పి ఇచ్చిన పెన్షన్‌ను రికవరీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే మల్లమ్మ పెన్షన్ రికవరీ వివాదంలో బీఆరెస్ పార్టీ రాజకీయ విమర్శలు చేస్తుందంటూ కాంగ్రెస్ విరుచుకపడుతున్నది. మల్లమ్మ కూతురు ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ చనిపోవడంతో డిపెండెంట్ పెన్షన్ అందుతున్నదని, మరో వైపు వృద్ధాప్య పింఛన్ కూడా వస్తున్నదని, అందుకే అధికారులు చర్యలకు ఉపక్రమించారని సమర్థించుకుంటున్నారు.

అనర్హులపై చర్యలుంటే.. అధికారులపై ఎందుకుండవు?

రైతుబంధు, ఆసరా పెన్షన్ రికవరీ వివాదాల్లో ఇంతకాలం లబ్ధిదారుల అనర్హతను గుర్తించని ప్రభుత్వ అధికారుల పనితీరు చర్చనీయాశంగా మారింది. అనర్హత కారణంగా లబ్ధిదారుల నుంచి ప్రభుత్వ సొమ్ము రికవరీ చేసినప్పుడు అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోరా?

అన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో స్థానిక అధికారులు విధి లేక అనర్హులను అక్కడక్కడ ఎంపిక చేస్తుంటారు. అయితే రికవరీ వివాదం నేపథ్యంలో అనర్హులైన లబ్ధిదారులపై చర్యలుంటే.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు ఎందుకుండవన్న ప్రశ్న రేకేత్తుతున్నది. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టే అధికార గణం.. ఇచ్చినవాళ్ళకి రెండు పెన్షన్లు ఇచ్చిన తీరుపై చర్యలెందుకు తీసుకోరన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. లబ్ధిదారుడికి అందిన సొమ్ము రికవరీలో సగం సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేస్తారా?

లేక శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా?

అన్నది తేలాల్సివుంది. అయితే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ వ్యవహారం కందిరీగల తుట్టెను కదిలించడమేనని, ప్రభుత్వానికి అలాంటి రికవరీల ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రికవరీ తెగే లెక్కేనా?

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల్లో అనర్హులైన లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ ప్రక్రియ అంత సులభతరం కాదంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి చర్యలు ప్రజల మధ్య పరస్పర ఫిర్యాదులకు, తగవులకు కారణమవుతాయన్న వాదన కూడా బలంగానే వినిపిస్తున్నది. రాజకీయంగా తమకు గిట్టని కుటుంబాల లబ్ధిదారులపై ఏదో ఒక అనర్హత అంశం లేవనెత్తి వివాదం సృష్టించే అవకాశాలు ఇప్పటికే సాగుతున్నాయి. అదీగాక రికవరీ చర్యలు నిస్సహాయులు, పేదలు, సామాన్యులకే పరిమితమయ్యే ప్రక్రియ తప్ప సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల వరకు వచ్చేసరికి సాధ్యంకాని ప్రహసనంగా మిగిలిపోతుంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేసే రికవరీ చర్యలు సమాజంలో తిరుగుబాటుకు ఆజ్యం పోయడంతోపాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దుర్వినియోగమైన, పక్కదారి పట్టిన ప్రభుత్వ సొమ్మును అనర్హులైన లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాలంటే పలు ప్రభుత్వ పథకాల్లో అలాంటి లబ్ధిదారుల జాబితా అంతులేని జాబితాను తలపించకతప్పదు. రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గొర్రెల స్కీమ్ , గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులలో లక్షల మంది అనర్హులు ఇప్పటికే ఉన్నారన్న వాదన మొదటి నుంచీ వినిపిస్తునే ఉంది. సంక్షేమ పథకాల వరకే రికవరీ చర్యలు పరిమితం కాకుండా ప్రభుత్వ భూములను అక్రమంగా పొందిన వారి నుంచి, ప్రాజెక్టులు, ప్రభుత్వ ఒప్పందాలలో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివాదాల్లో సైతం రికవరీ చర్యలు చేపడితే ప్రజల నుంచి పాలకుల దాకా రికవరీ ప్రక్రియ రానుంది. అలాంటప్పుడు రికవరీ వ్యవహారం జోలికెళ్లి కొరివితో తల గోక్కోవడం ఎందుకన్న వాదన రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. రాజకీయం, అధికార సాధన ప్రక్రియ అంతా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల చుట్టే సాగుతున్న మన వ్యవస్థలో రికవరీ వంటి సెల్ఫ్‌గోల్ చర్యలకు పోకుండా అనర్హులను జాబితా నుంచి తొలగించడం.. కొత్త లబ్ధిదారుల ఎంపికలో అనర్హులు ఉండకుండా చూడటమే శరణ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version