నారద వర్తమాన సమాచారం
ఏ పి హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను అవిష్కరించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
అమరావతి, ఆగస్టు 15:
రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈవేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ స్వరాజ్యం, స్వపరిపాలన భారతీయుల జన్మహక్కు అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్య్ర సాధనకై ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వలస వాదుల పాన నుండి భారత దేశాన్నికి విముక్తి కలిగించారన్నారు. నేడు అటువంటి మహానుభావుల అందరినీ స్మరించుకుంటూ శిరస్సు వంచి ప్రణామాలు చేయాల్సిన శుభదినం అన్నారు. వారి దేశభక్తి, జాతీయవాదం ప్రస్తుత మరియు రానున్న తరాలవారికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు. దేశ సమైఖ్యతను, సమగ్రతను కాపాడేందుకు సరిహద్దుల్లో నిరంతరం పాటుపడుతున్న సాయుధ ధళాల సేవలకు మనం అందరం ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సమిష్టిగా పనిచేస్తూ దేశ గౌరవం, సార్వభౌమత్వం మరియు ఐక్యతను కాపాడాల్సిన భాద్యత ప్రతి పౌరునిపై ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి ఉందన్నారు.
భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలో 1947 ఆగస్టు 15 అనేది ఎంతో చారిత్రాత్మకమైన దినమని, ప్రజాస్వామ్యం వ్యవస్థకు గట్టిపునాదులు పడటంతో పాటు గత 77 సంవత్సరాల్లో స్వపరిపాలనా వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రజలు స్వేచ్ఛా స్వాత్యంత్య్రాలతో సమానంగా జీవించే విధంగా భారత రాజ్యాంగ పరంగా ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలు సమ్మిళిత సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. చైల్డు రైట్స్, జ్యువెనైల్ జస్టిస్, మహిళా సాధికారత తదితర చట్టాలు సమ్మిళిత సమాజానికి మైలు రాళ్లవంటివి అన్నారు. అధికార వికేంద్రీకరణ, ఎన్నికలు, పార్లమెంటరీ మరియు న్యాయ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం, నమ్మకంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లుతుందన్నారు. ఈ మద్య జరిగిన ఎన్నికల్లో ఓటర్ల శాతం పెరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం అన్నారు.
భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా దేశ ప్రజలందరికీ న్యాయం, సమానత్వం , స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందజేయాలనే లక్ష్యంలో భాగంగా న్యాయ వ్యవస్థ ఎంతగానో కృషిచేస్తూ అందుకున్న ఆటంకాలను అన్నింటినీ అదిగమించడం జరుగుతుందన్నారు. సాధారణ ప్రజలకు న్యాయాన్ని నిరాకరించడం, ఆలస్యం చేయడం మరియు ప్రజా ప్రయోజనాల వాజ్యాలకు సంబందించిన కేసుల సత్వర పరిష్కారానికై ప్రత్యామ్నయ వివాద యంత్రాంగం మరియు డిజిటల్ టెక్నాలజీ ఏర్పాటు అనేవి న్యాయ వ్యవస్థలో సానుకూల అభివృద్దికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా న్యాయ పంపిణీ వ్యవస్థ ప్రభావ వంతంగా పనిచేసే విధంగా న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చిత్తశుద్దితో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో బాగంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన యువ లాయర్ కొండా వెంకటప్పయ్య మరియు చీరాల-పేరాల ఉద్యమంలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్యం కీలకమైన పాత్రలను పోషిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున స్వాతంత్ర్యోద్యంలో పాల్గొనెలా ప్రోత్సహించడమే కాకుండా బ్రిటీష్ వారి అనుచిత చట్టాలను తమకున్న లీగల్ అనుభవంతో ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించిన అహింస, సత్యాగ్రహం విధానాలు భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సిద్దింపచేయడంలో ఎంతో కీలక పాత్రలు పోషించాయన్నారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన శ్రీ పింగళి వెంకయ్య ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్పూర్తిని ప్రతిబింబిచే విధంగా జాతీయ జండాను రూపొందించి దేశంపై తనకు ఉన్న భక్తిని చాటుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, వారి కుటుంబ సభ్యులు, అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.