నారద వర్తమాన సమాచారం
నేడు ఎంగిలిపూల బతుకమ్మ..!!
ప్రపంచమంతా పూలతో పూజిస్తే.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక.
మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ్రి) ఇస్తారు.
ఈ సందర్భంగాపెద్దలకు ప్రీతిగా పెసరపప్పు గారెలు, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం గుమ్మంలో నీళ్లు చల్లి, ముగ్గులుపెడతారు. ఉదయాన తెచ్చుకున్న తంగేడు పూలు, గుమ్మడి పూలు, గునుగు పూలతో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ పేర్చుతారు. వీధిలోని వారంతా బతుకమ్మ ఆడతారు. ఉదయం నానబెట్టిన (మిగిలిన వడపప్పు) పెసరపప్పు, దోసకాయ ముక్కలు నైవేద్యంగా పెడతారు. పెద్దలకు పెట్టగా మిగిలింది కనుక ఎంగిలి (వాడిన) పప్పుగా, భోజనాలయ్యాక పేర్చే బతుకమ్మ కనుక దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తుంటారు. ఇవాళ్టి నుంచి మొదలయ్యే బతుకమ్మ సందడి తెలంగాణ వైభవాన్ని తొమ్మిది రోజులు చాటుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.