నారద వర్తమాన సమాచారం
శ్రీ మహిషాసురమర్దనీ దేవి అలంకారం (11-10-2024)
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి.
మహిష మస్తక నృత్త వినోదిని
స్ఫుట రణన్మణి నూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదని
సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గ, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది. సర్వాధిష్ఠాత్రి. శివరూపిణి. అన్నపూర్ణ, రాజరాజేశ్వరి. ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించేది. మోక్షదాయిని. ఆనంద ప్రదాయిని. శోకనాశిని. ఆర్తివినాశిని. తేజస్వరూపిణి. అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది. ఈ తల్లి దుష్ట సంహారిణి. శిష్ట సంరక్షణి. మహిషాసుర, చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి. కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి. కారుణ్యమూర్తి.
రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు (అసురులు) రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి సంకేతం. మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి, చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం చైతన్యమనేటువంటి విజ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేసి వధించటమే మహిషాసుర మర్దినీ తత్వం.
జయజయహే మహిషాసుర మర్దని రమ్యక పర్దిని శైలసుతే
అంటూ అమ్మవారిని ఉగ్రచైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువంటి కామ, క్రోధ మోహాదులు అన్నికన్నా ముఖ్యమైన జడత్వం, మూర్ఖత్వం అన్నీ నశించబడతాయి. ఈ దేహము ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవడం కన్నా లోకానికి వినియోగపడాలి. అలా వినియోగ పడేట్లుగా తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దినీ తత్వం.
అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు తొలగడానికి ఇటువంటి రూపమే అవసరమౌతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. మన వెనక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచం క్రమశిక్షణలో ఉంటాం. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఈమె ఆనందదాయిని. బద్ధకస్తులకు భయం కలిగించేది. అజ్ఞానంమీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమలక్షం.
ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం చక్కెర పొంగలి.
9.మహిషాసుర మర్ధిని !!
తొమ్మిదవ రోజు
!! బెల్లం అన్నం కావలసినవి !!
బియ్యం 100 గ్రాం
బెల్లం 150 గ్రాం
యాలకులు 5
నెయ్యి 50 గ్రాం
జీడిపప్పు 10
!! చేసే విధానం !!!
ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి.తరువాత మెత్తగా వుడికించాలి. అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి. జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి, యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపిదించేయడమే. తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృప కు పాత్రులవుదాము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.