నారద వర్తమాన సమాచారం
నేను స్వయంగా చంద్రబాబు బాధితురాలిని వైసిపి మాజీ మంత్రి రోజా
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్ర ఆర్ కే రోజా మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ధ్వజమెత్తారు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుపై అసభ్యకరంగా, బట్టలు విప్పించినట్లు కార్టూన్లను వేయించిన ఘనుడు చంద్రబాబేనని గుర్తు చేశారు. ఇది వ్యక్తిత్వ హననం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం లోటుపాట్లను సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపిన వారిని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని చంద్రబాబుపై రోజా విమర్శలు గుప్పించారు.
ఈ రాష్ట్రానికి ఓ మహిళ హోమ్ శాఖ మంత్రి ఉన్నప్పటికీ మహిళలు, ఆడబిడ్డలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని రోజా ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే మహిళా హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తోన్నారని ప్రశ్నించారు. సాక్షాత్తు వంగలపూడి అనిత ఇంటి దగ్గరే గంజాయి సాగు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన నడుస్తోందని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకట్ రెడ్డి దంపతులను పోలీసులు అతి దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ జగన్, వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దారుణమైన పోస్టులు పెట్టారని, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రోజా ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై దిగజారిపోయి, నీచాతినీచంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయాన్ని చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ మరిచిపోయినట్టున్నారని రోజా ఎద్దేవా చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.