నారద వర్తమానం సమాచారం
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది సంబరాలు
ఈ సంవత్సరం మంచి వర్షాలు; వ్యవసాయంలో చక్కని దిగుబడులు
విద్యార్థులకు మెరుగైన ఫలితాలు
పంచాంగ శ్రవణంలో పేర్కొన్న పండితులు
ప్రణాళికతో ముందుకు సాగుదాం: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడదాం : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
స్థానిక కలెక్టరేట్ లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో సాంస్కృతిక మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఉగాది సంబరాలకు అధ్యక్షత వహించగా, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే లకు మేళ తాళాల మధ్య వేదపండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన గావించి, ఉగాది పచ్చడి సేవించి ఉగాది సంబరాలను ప్రారంభించారు.
పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, వ్యవసాయంలో దిగుబడులు బాగా వస్తాయని పండితులు తెలిపారు. ముఖ్యంగా ఎర్ర పంటలకు ప్రసిద్ధి అయిన పల్నాడు జిల్లాలో మిర్చి, కందులు, జొన్నలు, దుంపలు బాగా పండుతాయని సెలవిచ్చారు.
జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని.. ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్, ఐసెట్, లాసెట్ వంటి ఉన్నత విద్య ఎంట్రెన్స్ టెస్టుల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. మహిళల మాటకు విలువ ,రాజకీయ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. వ్యాపారాలు బాగా జరిగినా ఆశించిన స్థాయిలో లాభాలు చూడకపోవచ్చన్నారు.
ప్రణాళికతో ముందుకు సాగుదాం : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది నాడు జిల్లా ప్రజలందరూ రానున్న సంవత్సర కాలంలో ఎదుగుదలకు ఒక ప్రణాళిక రచించుకుని ముందుకు సాగాలన్నారు. పంట దిగుబడి సమయంలో సంక్రాంతి, పండిన పంట అమ్మి సొమ్ము చేసుకునే సమయానికి ఉగాది పండగ జరుపుకుంటామని.. రైతులు తమ ఆదాయాన్ని ఎలా వినియోగించుకోవాలి, వచ్చే సంవత్సరం ఎలాంటి పంటలు వేయాలి అని ఆలోచించుకునే రోజు ఉగాది అని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఉన్నత ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు.
కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడదాం : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
ఉగాది సందర్భంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడదామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న పీ-4 కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారు పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలన్నారు. పారిశ్రామిక వేత్తలు పేదల కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవితాలను మెరుగుపరిచేందుకు సహకారం అందించాలన్నారు.
ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరం అన్ని వర్గాల వారికి చక్కని ఫలితాలనిస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ధనిక వర్గాలు పేదల అభివృద్ధికి పాటుపడాలన్నారు.
ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ గతంలోని చెడుని వదిలేసి మంచి మార్గంలో ముందుకు సాగాలని కోరారు. జీవితం మొత్తం ఆనందంగా ఎవరికీ ఉండదని.. కష్ట, నష్టాలను తట్టుకుని నిలబడటం అలవర్చుకోవాలన్నారు.
వక్తల ప్రసంగం అనంతరం జిల్లాలో వివిధ రంగాల్లో కృషి చేసిన 16 మంది ప్రముఖులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, ఆర్డీవో మధులత, జిల్లా అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.