నారద వర్తమాన సమాచారం
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా కార్యక్రమాలు : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
2025-26 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా జిల్లాలో కార్యక్రమాలు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, పశు పోషణ, పర్యాటక రంగాలలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అభివృద్ధి, ఉపాధి హామీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఉద్యాన రంగంలో పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల విస్తీర్ణం పెరిగితే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. జిల్లాలో డిసెంబర్-మార్చి కాలంలో షేడ్ నెట్లు నిరుపయోగంగా మారుతున్నాయని, ఆ సమయంలో సైతం మొక్కల పెంపకం చేపడితే అదనపు ఆదాయం సృష్టించొచ్చన్నారు.
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం 20,000 హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. సన్నకారు రైతులకు ప్రకృతి వ్యవసాయం అనుకూలంగా ఉంటుందని, సంవత్సరమంతా ప్రతి నెలా కొంత ఆదాయాన్నిస్తుందన్నారు.
పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో వృద్ధి సాధించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించనున్నామన్నారు.
ఇప్పటికే పాడిరంగంలో ఉన్న స్వయం ఉపాధి సంఘాల మహిళలకు అదనపు పశువుల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కోళ్ల ఫారాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నిలిచిపోయిన కోళ్ల ఫారాలు తిరిగి ప్రారంభించేందుకు సహకారం అందిస్తామన్నారు.
అన్ని అనుమతులు పొంది వివిధ కారణాల చేత నిలిచిపోయిన పరిశ్రమలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతో పాటూ పారిశ్రామిక వృద్ధి సాధించగలమన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజక వర్గ కేంద్రంలో ఒక కొత్త హోటల్ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకులు రెండు, మూడు రోజు ఇక్కడే ఉండటానికి వసతుల కల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.
జిల్లా అభివృద్ధికి సానుకూలంగా ముఖ్యమంత్రి
కలెక్టర్ల సమావేశంలో జిల్లా అవసరాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించడం జరిగిందని, జిల్లా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సహకారంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. కలెక్టర్ కార్యాలయ భవనం, ఉద్యోగులకు వసతి అంశాలకు తొందర్లోనే పరిష్కారం దక్కనుందన్నారు. రాజీవ్ గృహ కల్ప నిర్మాణాలు ఉద్యోగుల వసతికి వినియోగించే అంశం పరిశీలనలో ఉందన్నారు.
బర్డ్ ఫ్లూ విషయంలో ఆందోళన వద్దు
జిల్లాలో నమోదైన బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదైన ప్రాంతంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారన్నారు.
జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని, ప్రజలు అప్రమత్తతలో భాగంగా పూర్తిగా ఉడికించిన చికెన్ తినడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఉపాధి హామీ పథకంలో పంచ ప్రాధాన్యతా కార్యక్రమాలు
వేసవిలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకంలో పంచ ప్రాధాన్యతా కార్యక్రమాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వేసవిలో పశువులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో 343 నీటి తొట్లు నిర్మిస్తామన్నారు. 10 నుంచి 15 రోజుల్లో తొట్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు.
జిల్లాలో అన్ని చెరువులలో కనీస అవసరాలకు తగ్గట్టు నీరు నింపడం, కాల్వల పూడిక తీత పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం 7 చెరువుల్లో 25-50 శాతం, 32 చెరువుల్లో 50-75 శాతం నీటి లభ్యత ఉందన్నారు. 6253 కి.మీ మేర కాల్వల్లో పూడిక తీత పనులు చేపడతామన్నారు.
జిల్లాలో ఇప్పటికే గ్రౌండింగ్ అయిన 1100 ఫారం పాండ్లను జూన్ 8 నాటికి పూర్తి చేస్తామన్నారు. మొత్తం 6500 ఫారం పాండ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.
ఉపాధి కూలీల వేతనం రూ.300 కి తగ్గకుండా అందేలా పనులు, పని వేళలు కేటాయించనున్నామన్నారు. మొత్తం 54.55 లక్షల పని దినాలు ఉపాధి కల్పించడం లక్ష్యమన్నారు.
వంద రోజులు పూర్తి అయిందన్న భ్రమతో కొందరు ఉపాధి హామీ లబ్ధిదారులు పని కోరడం లేదని.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయినందున మళ్లీ వంద రోజుల కోటా ప్రారంభమైందని తెలిపారు.
ఎండలతో జాగ్రత్త
జిల్లా ప్రజలు ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఒంటి పూట బడులు, రాబోయే రోజుల్లో పాఠశాలల సెలవుల కారణంగా పిల్లలు ఈత పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తల్లిదండ్రులు కనిపెట్టుకోవాలన్నారు.
జిల్లాలో తాగు నీటి సమస్యకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మినరల్ వాటర్ అందుబాటులో ఉంచామన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో మురళి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.