నారద వర్తమాన సమాచారం
ప్రజలకోసం నిర్వహించే కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించండి
పాత్రికేయులను కోరిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
ఫిబ్రవరి నుంచి నియోజకవర్గాల స్థాయిలో పీజీఆరెస్
ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్
పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ‘ లక్ష్య సాధన ‘ కార్యక్రమం ద్వారా ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
అర్హులకు మాత్రమే పింఛను అందించేందుకు తనిఖీలు
ఏప్రిల్ 1 నుంచి మండలానికి ఒక డ్రోన్ మంజూరు
నరసరావు పేట:-
జిల్లాలో ప్రజల సౌకర్యార్థం నిర్వహించే కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు.
గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్నెళ్ల కాలంలో విజయవంతంగా నిర్వహించిన కార్యక్రమాలు, రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
నియోజక వర్గాల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఇప్పటి వరకూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తూ వచ్చిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఫిబ్రవరి 1 నుంచి నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించనున్నాం. ఒక సోమవారం జిల్లా స్థాయిలో మరో సోమవారం ఏదేని నియోజకవర్గంలో నిర్వహిస్తాం. అవసరమైతే మండల స్థాయికి పీజీ ఆర్ఎస్ ను తీసుకువెళ్తాం. ఫిర్యాదుల పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్ నియామకం చేశాం. రానున్న రోజుల్లో మండల స్పెషల్ ఆఫీసర్లతో అధికారులు ఇచ్చిన పరిష్కారాలకు ఆడిట్ నిర్వహిస్తాం.
అర్జీలు రాయడంపై అవగాహన లేని వారి సౌకర్యార్థం కలెక్టరేట్ లో ఉచితంగా అర్జీలు రాసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విషయంపై ప్రచారం కల్పించండి.
ఆర్నెళ్ల కాలంలో కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కు 11,176 పిటిషన్లు అందగా.. వాటిల్లో 7258 పరిష్కరించబడ్డాయి. మిగిలిన అర్జీలు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులను నాణ్యమైన పరిష్కారాలు అందించడం, రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పని చేయనున్నాం.
ఉపాధ్యాయుల రేషనలైజేషన్
ఇప్పటి వరకూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించే విధానానికి బదులుగా పాఠశాలలో ఉన్న తరగతుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయింపు చేసే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరంలో అవలంభించనున్నాం. ఒకటి, రెండు తరగతులకు.. ఆపైన తరగతులకు వేరు వేరుగా టీచర్లను నియమిస్తాం. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఏ మాత్రం తగ్గబోదు.
పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ‘లక్ష్య సాధన ‘ పేరుతో విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయనున్నాం.
అర్హులకు మాత్రమే పింఛను అందించేందుకు తనిఖీలు
జిల్లాలో వివిధ ఆరోగ్య సమస్యల వల్ల పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి అందించే రూ.15,000 ఫించన్ పూర్తిగా అర్హులకు మాత్రమే అందించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నాం. వాస్తవమైన అర్హులకు గుర్తించడమే తప్పించి పింఛను తొలగించడం జరగదు. అర్హతకు మించి ఎక్కువ ఫించన్ పొందేవారికి న్యాయంగా రావాల్సిన ఫించన్ అందిస్తాం.
జిల్లాలో ప్రతినెలా మొదటి రోజే 99.4 శాతం పింఛన్లు ఇంటివద్దే మంజూరు చేస్తున్నాం. మూడు నెలలకోసారి ఫించన్ తీసుకునే అవకాశం ఉండటం వల్ల వందశాతం మందికి ఇవ్వలేని పరిస్థితి ఉంది.
ప్రభుత్వ భూములతో రీ సర్వే ప్రారంభం
జిల్లాలో ప్రభుత్వ భూముల రీ సర్వే కొనసాగుతోంది. ముందుగా ప్రతి గ్రామంలో సరిహద్దులను నిర్ణయించి అనంతరం పూర్తి స్థాయిలో ప్రైవేటు భూముల సర్వే చేపడతాం. గతంలో జరిగిన తప్పులను పరిష్కరిస్తూ ముందుకువెళ్తాం.
రెండు వారాల పాటూ అంగన్ వాడీళ్లోనే ఆధార్ ఎన్రోల్మెంట్
శిశువుల ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం అంగన్ వాడీ స్థాయిలోనే ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అంగన్ వాడీళ్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ నిర్వహించే ఈ కార్యక్రమం వచ్చే వారం కూడా కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించండి.
అభివృద్ధి
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుపై ఫీజిబిలిటీ స్టడీ కొనసాగుతోంది. ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి. ఓడరేవు – నకరికల్లు జాతీయ రహదారి విషయంలో రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తాం.
నాగార్జున సాగర్ వద్ద విజయపురి సౌత్ నివాస స్థలాన్ని నీటి పారుదల శాఖ నిర్వహణ చేయలేని పరిస్థితి ఉంది. ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ హోదా ఇచ్చి పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
యల్లమంద గ్రామాల్లో పట్టలు కుట్టే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం, రుణాలు అందించి ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించే అవకాశాలపై జిల్లా అధికారులతో కమిటీ వేయడం జరిగింది. జిల్లాలో లెదర్ పరిశ్రమ ఏర్పాటు కోసం రెండు, మూడు నియోజకవర్గాల్లో భూముల పరిశీలన జరిగింది. దుర్గిలో నిలిచిపోయిన లెదర్ పరిశ్రమ ఏర్పాటును కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నాం.
రైతులకు డ్రోన్లు
ఏప్రిల్ ఒకటి నుంచి కనీసం మండలానికి ఒక డ్రోన్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశాం. జిల్లాకు మొత్తం 40 డ్రోన్లు మంజూరవగా.. రైతు సమూహాలకు శిక్షణ ఇచ్చి మండలానికి కనీసం ఒక డ్రోన్ నిర్వాహకుడు ఉండేలా చూస్తాం.
యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా పీఎం ఇంటర్న్ షిప్ కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులకు రూ.6,000 వరకూ స్టైపెండ్ ఇచ్చి మరీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులను మెరుగుపరిచేందుకు సీఎస్సార్ నిధులను వినియోగించే అవకాశాలు పరిశీలిస్తున్నాం. హాస్టళ్లలో కనీస వసతులు ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నాం.
ఫిబ్రవరి నాటికి జిల్లాలో మొత్తం 426 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగలోకి తీసుకువస్తాం.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఎర్వో మురళి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.