Wednesday, October 15, 2025

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

నారద వర్తమాన సమాచారం

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. కాగా ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్టు సమాచారం.

కాగా మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం. కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

తగ్గిన సభ్యుల సంఖ్య..

10 రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. 2004లో నాటి పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినపుడు 42 మందితో కేంద్రకమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, సహజమరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కి తగ్గిపోయింది. రెండు దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్యభారతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనతన సర్కార్‌ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్‌ వంటి కంచుకోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంది.

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో సెంట్రల్ కమిటీ మెంబర్‌ను కోల్పోయింది. ఏపీ గ్రేహౌండ్స్ ఎన్ కౌంటర్‌లో ఏవోబీ సెక్రెటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడు. వరంగల్, భూపాల పల్లి జిల్లాకు చెందిన గాజర్ల రవి.. కాంగ్రెస్ నేత, మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు సోదరుడే గాజర్ల రవి. కాగా భద్రతా బలగాలు ఉదయ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం ఇవ్వలేదు.

ఆపరేషన్‌ కగార్‌…

కానీ, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్‌, ఓడిశా సరిహద్దుల్లోని కుల్హదీఘూట్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్‌ జయరాం, అలియాస్‌ చలపతి మరణించారు. ఆ తర్వాత మే నెలలో బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మరణించారు. అదే నెలలో నారాయణపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించటం ఇదే ప్రథమం. ఆ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతోపాటు 27 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీకి చెందిన తెంటు నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌ (64) చనిపోయారు. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.

మిగిలింది 16 మంది…

కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా, జార్ఖండ్‌కు చెందినవారు ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఇద్దరున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేష్‌, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌, పోతుల కల్పన. జార్ఖండ్‌కు చెందిన వారు మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునీల్‌, అనల్‌ దా అలియాస్‌ పాతిరాం మాంజీ, సహదేవ్‌ అలియాస్‌ అనూజ్‌. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు మాజ్జీదేవ్‌ అలియాస్‌ రాంధీర్‌, మాడ్వి హిడ్మా. వీరిలో పలువురు 60 ఏళ్లకు పైబడినవారే. కాగా, కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవర్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తారని పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version