Thursday, March 12, 2026
spot_img

రైతులు భయపడొద్దు… మోసపోవద్దు.మంత్రి కింజారపు అచ్చంనాయుడుమంత్రి కింజారపు అచ్చంనాయుడు

నారద వర్తమాన సమాచారం

రైతులు భయపడొద్దు… మోసపోవద్దు

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం

మనది రైతు ప్రభుత్వం

అందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది

గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు… ఆర్థిక వ్యవస్థ కుంటుబడింది

కొద్దిరోజుల్లో అన్నదాత సుఖీభవ నగదును జమ చేస్తాం

నల్ల బర్లీ పొగాకు చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి కింజారపు అచ్చంనాయుడు పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు. పర్చూరు మండలం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు గురువారం ప్రారంభించారు. ముందుగా పర్చూరు ప్రధాన కూడలి నుంచి మార్కెట్ యార్డ్ వరకు రైతులు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. పుష్పాలతో ఆయనకు ఘనంగా ఆహ్వానం పలికారు. మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం గోదామును ఆయన పరిశీలించారు. హెచ్ డి ఆర్, హెచ్ డి ఎం రకం బ్లాక్ బర్లీ పొగాకు ఒక క్వింటా ధర రూ. 12వేలు, హెచ్ డి ఎక్స్ రకం పొగాకు ఒక క్వింటా రూ.ఆరు వేలు ధరతో మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రకటించారు.

నల్ల బర్లీ పొగాకును రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కొనుగోలు చేస్తుందని మంత్రి అచ్చంనాయుడు తెలిపారు. రైతులు రాజుగా ఉండాలి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించేలా అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. రైతుల కష్టాలన్నీ తీరుస్తున్నాం, రహదారులు, నీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి ప్రధమ ప్రాధాన్యతనిస్తున్నారని వివరించారు. 90% రాయితీపై స్ప్రింక్లర్లు, బిందు సేద్యానికి సంబంధించిన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. గత ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1,650 కోట్లను చెల్లించామన్నారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ఘనత ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్చి, మామిడి, కోకో, బ్లాక్ బర్లీ పొగాకు పంటలకు తీవ్ర సమస్య వచ్చిందన్నారు. మిర్చి ధర తగ్గకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక బద్ధంగా మద్దతు ధరతో కొనుగోలు చేశారన్నారు. మామిడి పంటకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన కంపెనీలు ఇప్పుడు దిగుబడి రాగానే చేతులెత్తేశాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడు లేనట్లుగా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలులు ప్రారంభించిందన్నారు. కొనుగోలు చేసిన పొగాకును విదేశాలకు ఎగుమతి చేయాలంటే నాణ్యతను, మార్క్ ఫెడ్ నిబంధనలను రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పొగాకు రైతులకు సుమారుగా రూ.500 కోట్లు నగదు రానున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్చూరు, చీరాల, బికే పాలెం , గుంటూరు ,ఎడ్లపాడు, గుడ్లవల్లి, పెదకాకాని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.

పొగాకు రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి అచ్చంనాయుడు స్పష్టం చేశారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులకు రైతులు గురిగాకుండా ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, భూమి, వాతావరణ సమతుల్యతను బట్టి ఎలాంటి పంటలు సాగు చేయాలో ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, అధికారుల సూచన మేరకు రైతులు పంటల సాగు చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందన్నారు.

రైతుల కళ్ళల్లో కన్నీరు చూడరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మార్క్ ఫెడ్ ఎండి మంజీర్ జిలాని సమాన్ చెప్పారు. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఆదుకోవటానికే ప్రభుత్వం ముందుకు వచ్చి బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.

రైతుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. చివరి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొనుగోలు సాధ్యం కాదని రైతులు అపోహ పడ్డారని, అసాధ్యాన్ని హస్త ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. విదేశీ మరకద్రవ్యం అధికంగా వచ్చే బ్లాక్ బర్లీ పొగాకు పంటను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పొగాకు పంట అత్యధికంగా పర్చూరు నియోజకవర్గంలోని రైతులు సాగు చేశారని, వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. తదుపరి ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయం మేరకు పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రణాళికతో ముందుకు సాగాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, వేర్ హౌసింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్, లేట్ క్యాప్ చైర్మన్ ఎరిక్షన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్ ఫెడ్ ఏడి కరుణశ్రీ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, జిల్లా సహకార శాఖ అధికారి శ్యాంసన్, బుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా అధికారులు తదితర శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version