నారద వర్తమాన సమాచారం
ఏపీ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు – రసాయన కిట్లతో రేషన్ బియ్యం గుర్తింపు
పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం మాఫియా చేతుల్లో దుర్వినియోగమవుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. బియ్యం ఎక్కడైనా పట్టుబడితే అది ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారానా, లేక ప్రైవేట్ మార్కెట్లోదా అనే విషయం గుర్తించేందుకు కొత్త రసాయన కిట్లను అందజేసింది.
ప్రజల నిర్లక్ష్యం – మాఫియాకు మేలు: రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్నా, చాలా మంది దాన్ని వినియోగించకుండా విక్రయిస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం 60 శాతం మంది కార్డుదారులు బియ్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారు. ఇంకా 20 శాతం మంది వలస కూలీలు, తాము పనిచేసే ప్రాంతాల్లోనే బియ్యాన్ని అమ్ముతున్నారు. ఇలా 80 శాతం బియ్యం మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోతుండటమే సమస్యకు మూలం.
రసాయన కిట్లతో గుర్తించే విధానం: శ్రీకాకుళం జిల్లాలోని 15 మంది పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, 4 మంది యూడీఆర్‌ఐలు, 2 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఈ కొత్త రసాయన కిట్లు అందజేశారు. మరో కిట్ జిల్లా కేంద్రంలో ఉంచారు. బియ్యాన్ని ఈ కిట్లలోని రెండు రసాయనాలతో పరీక్షిస్తే రేషన్ బియ్యం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆరు నెలల కిందట పంపిణీ చేసిన బియ్యం అయినా, పాలిష్ చేసినా, ఈ పరీక్షలో తేలిపోతుంది. ఈ విధానం ద్వారా అధికారులు తక్షణ నిర్ణయం తీసుకుని అక్రమ రవాణా చేస్తున్న వారిపై స్పాట్‌లోనే కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇక రేషన్ బియ్యం మాఫియాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ పద్ధతి కీలక పాత్ర పోషించనుంది.
జిల్లాలో సన్నాహాలు పూర్తి: జిల్లా పౌర సరఫరాల అధికారి జి. సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, “రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం అందజేసిన రసాయన కిట్లు తనిఖీల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. పరీక్షలో ఎరుపు రంగు కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేస్తాం. అన్ని సీడీటీలకు కిట్లు అందించి వాటి వినియోగంపై అవగాహన కల్పించాం” అన్నారు. రాబోయే రోజుల్లో ఈ చర్యలతో రేషన్ బియ్యం మాఫియా బలహీనపడనుంది. అక్రమ రవాణా రాకడలు నిలిచిపోతే, నిజమైన లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం చేరే అవకాశముంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







