Friday, November 21, 2025

పోలి స్వర్గం నోము ప్రాశస్త్యం పోలిస్వర్గం కధ

నారద వర్తమాన సమాచారం

పోలి స్వర్గం నోము ప్రాశస్త్యం పోలిస్వర్గం కధ

స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీనకాలం నుంచి కార్తీకమాసంలో స్త్రీలు అందరిని ప్రభావితం చేసే నోములలో పోలిస్వర్గం నోము ఒకటి.

ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకూ ప్రాతః కాలమేలేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు, ఈ పోలి స్వర్గం నాడు తెల్లవాఝామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన యెడల కార్తీకమాసం అంతా తెల్లవాఝామున నదీస్నానమాచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితములు కలుగును.

పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి (పోలి పాడ్యమి)రోజున వెలిగించుకోవాలి.

స్త్రీలందరూ ఈ రోజున కలసికట్టుగా నదీస్నానం చేసి, నదిఒడ్డునే దీపములను వెలిగించి, నోమును ఆచరించి, బ్రాహ్మణోత్తమునలకు స్వయంపాకములు, దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం.

పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.

పోలి స్వర్గం నోము కధ:

ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం … పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి … పూజలు చేయడానికి … అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి … పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది.

ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు … కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున  దీపదానం ఇవ్వాలి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version