Tuesday, April 28, 2026
spot_img

ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఆంధ్ర యూనివర్సిటీ…

నారద వర్తమాన సమాచారం

ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఆంధ్ర యూనివర్సిటీ…

ఆంధ్ర యూనివర్సిటీకి వందేళ్లు: బెజవాడలో మొదలైన ఈ వర్సిటీ విశాఖ తీరానికి ఎలా చేరింది? 100 ఎయు ఏళ్ల ప్రయాణం…

వైజాగపటం (విశాఖ) సాగరతీరానికి ఆనుకుని జీడిమామిడి తోటలు, ఎర్రమట్టి దిబ్బల మధ్య ఆవిర్భవించిన ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇప్పుడు వందేళ్ల మైలురాయిని చేరుకుంది.

ఒక చిన్న మ్యూజియంలో, రెండే కోర్సులతో ప్రారంభమైన ప్రయాణం.. నేడు 425 ఎకరాల్లో 6 కళాశాలలు, 58కి పైగా విభాగాలతో విస్తరించింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూనివర్సిటీ మొత్తం రైలులో గుంటూరుకి తరలిపోయి, మళ్లీ మూడేళ్లకు విశాఖ వచ్చింది.
ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఏయూ వేదికైంది!
భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ స్వయంగా ఒక అరుదైన రాయిని వెతుక్కుంటూ ఏయూకి వచ్చిన ఘనత కూడా ఈ వర్సిటీ సొంతం.
వైభవమైన గతం, కొన్ని ఒడిదుడుకులు, అనేక విజయాలతో నిండిన ఆంధ్ర విశ్వవిద్యాలయానిది వందేళ్ల కథ!

ఉమ్మడి మద్రాస్‌లో మొదలైన కథ

ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రను ఏయూ చరిత్ర, పురావస్తు శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ వివరించారు.

ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో ఆంధ్రోద్యమం ప్రభావంతో తెలుగువారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమనే డిమాండ్ బలపడింది. దీంతో 1920లో భాషా ప్రాతిపదికన కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మద్రాస్ ప్రావిన్స్ ఆమోదం తెలిపింది. మొదట వాల్తేరు (విశాఖ)లో ఏర్పాటు చేయాలనుకున్నా, చివరకు బెజవాడ (విజయవాడ)లో “ఆంధ్ర విశ్వకళాపరిషత్” పేరుతో ప్రారంభించారు. 1926లో ఏప్రిల్ 26న బెజవాడలో వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

వసతి, పరిపాలనా సమస్యల కారణంగా 1929లో చట్ట సవరణ జరిగి…1930 సెప్టెంబర్‌లో యూనివర్సిటీని విశాఖపట్నానికి తరలించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942లో విశాఖపై బాంబు దాడి తర్వాత ఏయూ ప్రాంగణం సైనిక స్థావరంగా మారడంతో.. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, మద్రాసుకు తరలించారు. పుస్తకాలు, పరికరాలు రైళ్లలో తరలించి అక్కడే తరగతులు కొనసాగించారు.

యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఏయూ మళ్లీ విశాఖకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి విశాఖనే దాని శాశ్వత చిరునామాగా మారింది.
తొలి రోజుల్లోనే మహిళా ఉద్యమాలు
ఏయూ కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదు, సామాజిక మార్పులకు వేదిక కూడా. ఏయూలో మహిళల హక్కుల గురించి 1930 దశకంలోనే పోరాటం చేశారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్.

“1930లో ఇక్కడ రాజకీయ శాస్త్రం చదువుతున్నప్పుడు భద్రత, నిర్వహణ వంటి కారణాలతో విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం లేదు. ఈ పరిస్థితుల్లో మహిళలకు కూడా పురుషుల్లాగే సమాన హక్కులు ఉండాలని దుర్గాబాయి దేశ్‌ముఖ్, లేడీస్ హాస్టల్ కోసం ఆందోళనలు చేశారు. దాంతో ఏయూలో మహిళలకు హాస్టల్స్ నిర్మించారు” అని కొల్లూరు సూర్యనారాయణ బీబీసీకి చెప్పారు.

“ఏయూ లేడీస్ హాస్టల్‌, మహిళా అధ్యయన కేంద్రానికి దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరునే పెట్టారు” అని ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ సి.మంజులత తెలిపారు.

ఏయూలో అసెంబ్లీ సమావేశాలు
ఏయూ రాజకీయ చరిత్రకూ వేదికైంది.

“1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాశ్వత రాజధాని, అసెంబ్లీ వసతులు లేని సమయంలో ఏయూలోని టీఎల్ఎన్ సభ హాల్‌లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. విద్యార్థుల హాల్, రాష్ట్ర అసెంబ్లీగా మారింది” అని కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు.

“తాజాగా 2014 ఏపీ విభజన తర్వాత కూడా విభజిత ఏపీలో పరిపాలనకు శాశ్వత వేదికలు సిద్ధంగా లేని సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయూ క్యాంపస్‌లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఇలా ఒకే వేదికపై విద్య, పాలన కలిసిన అరుదైన సందర్భాలు ఏయూ చరిత్రలో చోటుచేసుకున్నాయి.”


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version