నారద వర్తమాన సమాచారం
ఇబ్రహీంపట్నంలో నివురుగప్పిన నిప్పులా రేషన్ మాఫియా… ప్రభుత్వాలు మారినా మారని వైనం!
అధికారుల పర్యవేక్షణ లోపం నెలవారీ మామూళ్ల మత్తులో రెవెన్యూ యంత్రాంగం..
బహాటంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం..
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకులు మారినా పేదల కడుపునింపాల్సిన రేషన్ బియ్యం అక్రమ దందా మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఇబ్రహీంపట్నం మండలంలో రేషన్ మాఫియా రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే, అసలు ఇక్కడ చట్టం, నిబంధనలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. కొందరు అవినీతి డీలర్లు, దళారులు కుమ్మక్కై పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారు.
కీలక పాత్ర పోషిస్తున్న కొందరు రేషన్ డీలర్లు
ఇబ్రహీంపట్నం మండలంలో కొందరు రేషన్ డీలర్లు ఈ మాఫియాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారుల వద్ద నుంచి కేవలం రూ. 10 నుండి రూ. 12 లకే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ, వాటిని నేరుగా మాఫియా గ్యాంగ్‌లకు అప్పగిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది బియ్యం బస్తాలు ఇలా అక్రమ మార్గంలో తరలిపోతున్నా, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారుల నిఘా శూన్యం మాఫియాకు రెక్కలు
మండలంలో ఉన్న రేషన్ దుకాణాలపై రెవెన్యూ అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉండటంతో మాఫియా గ్యాంగ్‌లకు మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది. “మేము రెవెన్యూ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నాం, మమ్మల్ని ఆపేవాడే లేడు” అంటూ ఆ దళారులు బాహాటంగానే ప్రకటిస్తూ దందాను కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఎండీయూ వాహనాల తొలగింపు తర్వాత మళ్లీ పెరిగిన దందా
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటింటికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ‘ఎండీయూ’ వాహనాల ద్వారా సరఫరా చేపట్టారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాహనాల వ్యవస్థను పూర్తిగా తొలగించి, మళ్లీ పాత పద్ధతిలోనే డీలర్ల ద్వారా రేషన్ పంపిణీని పునరుద్ధరించింది. ఎండీయూ వాహనాల రద్దుతో రేషన్ మాఫియాకు మళ్లీ లైసెన్స్ దొరికినట్లు అయిందని, ఇప్పుడే డీలర్లు మరింతగా రెచ్చిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు.
ప్రశ్నార్థకంగా మారిన ప్రభుత్వ చర్యలు:
రేషన్ బియ్యం విదేశాలకు, పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్నప్పటికీ, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. అంటే, ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ‘వాటాలు’ అందుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ దందాకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది. పేదల బియ్యాన్ని దోచుకుంటున్న ఈ మాఫియా డాన్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎప్పుడు కొరడా ఝుళిపిస్తారని ప్రజలు, డిమాండ్ చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








