Sunday, October 18, 2026
spot_img

డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డికి పర్యావరణ మిత్ర పురస్కారం

. నారద వర్తమాన సమాచారం

డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డికి పర్యావరణ మిత్ర పురస్కారం

గుంటూరు నగరంలో గత దశాబ్దకాలంగా 10 వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్న డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డిని చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌర సంస్థలు పర్యావరణ మిత్ర పురస్కారంతో సత్కరించాయి. ఈనెల 18వ తేదీన ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన డా|| బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అభినందన సభకు చేయూత ఫౌండేషన్ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ గుంటూరు నగరాన్ని హరిత వనంగా మార్చడానికి దృఢమైన సంకల్పంతో కృషి చేస్తున్న డా|| బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రధానం చేయాలని కోరారు. యూరప్ లో అనేక దేశాల్లో పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ గ్రీన్ పార్టీలు ఏర్పడుతున్నాయని, భారత దేశంలో పచ్చదనం పెంపుదలకు ఎంతో కృషి జరగాలన్నారు. శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి శ్యామల నగర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ లో దాదాపు 15 కిలోమీటర్ల మేర మొక్కలు నాటి సంరక్షించడం గొప్ప విషయమన్నారు. ఎల్ నినో నేపథ్యంలో అడవులను రక్షించుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. చేయూత ఫౌండేషన్ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణ సమతుల్యత కోసం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా భారతదేశంలో 24 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 21 శాతం ఉంటే గుంటూరు జిల్లాలో కేవలం 7 శాతం మాత్రమే ఉండడం బాధాకరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి వ్యక్తికి 422 చెట్లు ఉండగా, భారతదేశంలో కేవలం 28 మాత్రమే ఉన్నాయని తెలిపారు. డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి విరామ మెరుగని వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణను ప్రవృత్తిగా స్వీకరించి ఎవర్ గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ స్థాపించి దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి పదివేల మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్న సందర్భంగా పర్యావరణ మిత్ర బిరుదుతో సత్కరించడం ఆనందదాయకమన్నారు అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ వై. రత్తయ్య ప్రసంగిస్తూ డా|| బూసి రెడ్డి నరేంద్రరెడ్డి నాతో గ్రీన్ మైల్స్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి వారి ఆసుపత్రిలో మోకాలు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఓ మొక్కను అందించి నాటమని ప్రోత్సహించడం వారి అంకితభావానికి చిహ్నం అన్నారు. పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డా|| బూసిరెడ్డి నరేంద్రరెడ్డి స్పందిస్తూ సామాజిక బాధ్యతగా బి.యం.ఆర్. హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రతిభ గల పేద విద్యార్థులను ఆదుకుంటున్నామని, ఉన్నతి హెల్త్ ఫౌండేషన్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వందలాది పేదలకు ఉచితంగా మోకాలి ఆపరేషన్లు చేస్తున్నామని, ఇందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందటం ఆనందదాయకంగా ఉందని, ఎవర్ గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ సమతుల్యతకు, మొక్కల సంరక్షణకు గత దశాబ్ద కాలంగా ఆరుగురు కార్మికులను నియమించుకొని ప్రతి నెలా లక్ష రూపాయలు వెచ్చిస్తూ పదివేల మొక్కలను సంరక్షించడం ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. నేడు చేయూత ఫౌండేషన్ ద్వారా పర్యావరణ మిత్ర పురస్కారాన్ని అందుకోవడం తన బాధ్యతను నాలుగు రెట్లు పెంచిందని పేర్కొన్నారు. సౌత్ కొస్టల్ రైల్వేస్ మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ ఎస్. మంజునాథ్ ప్రసంగిస్తూ గుంటూరులోని రైల్వే ఎకో పార్క్ లో వెయ్యి మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, డా|| బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, మానవత నేతలు వజ్రాల వెంకట నాగిరెడ్డి, పోలూరి వీరారెడ్డి, కె.సతీష్, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి తమ్మా ధనుంజయ రెడ్డి, కోవిడ్ ఫైటర్స్ నేత బషీర్ అహ్మద్, తెలుగు భాషోద్యమ నేత పి. సింగారావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, శ్యామల నగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రాఘవరావు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, గుంటూరు గ్రీన్ కోర్ బాధ్యులు డి. తిరుపతి రెడ్డి, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, సేవా తత్పరులు బండి అశోక్ రెడ్డి, ప్రముఖ రచయిత మోదుగుల రవికృష్ణ, బి.ఎం.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తదితర పౌర సంస్థల నేతలు పాల్గొని ప్రసంగించారు. తొలుత అతిధులందరూ పర్యావరణ మిత్ర డాక్టర్ బుసిరెడ్డి నరేంద్రరెడ్డి ని శాలువా తో సత్కరించి సన్మాన పత్రాన్ని అందజేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version