Thursday, October 29, 2026
spot_img

01/11/26వ తేదీ న ఆదివారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి – పల్నాడు జిల్లా ఎస్పీ  జగదీష్ అదహళ్లి, ఐపీఎస్

నారద వర్తమాన సమాచారం

01/11/26వ తేదీ న ఆదివారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి – పల్నాడు జిల్లా ఎస్పీ  జగదీష్ అదహళ్లి, ఐపీఎస్

పల్నాడు జిల్లాలో 01/11/26వ తేదీన (ఆదివారం) జరగబోవు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారు సూచించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి,ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో ఎవరైనా ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజలు ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎన్నికలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు, బెదిరింపులు లేదా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలను మోహరించినట్లు తెలిపారు.

పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద, స్ట్రాంగ్ రూముల వద్ద ఎస్పీ  ప్రత్యేకంగా పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేసి ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా ఎన్నికలు జరుగు నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని మద్యం షాపులు ది.30/10/2026 వ తేదీ సాయంత్రం 5గంటల నుండి 02/11/2026 వ తేదీ ఉదయం వరకు తెరవడం కానీ, మద్యం అమ్మడం కానీ చేయకూడదని అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

లాడ్జిల యజమానులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి లాడ్జిలలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన ఎడల పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని,స్థానిక వ్యక్తులు కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. ప్రతి ఓటరు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version