నారద వర్తమాన సమాచారం
జూన్ :04
మరికొన్ని గంటల్లో …ఉత్కంఠకు తెర
కౌంటింగ్‌కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు : సిఇఓ
ఉదయం 8 గంటలకు ప్రారంభం
రెడ్‌జోన్‌గా కౌంటింగ్ సెంటర్ల పరిసరాలు
ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు మద్యం దుకాణాలు బంద్
కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ అధికారపగ్గాలు ఎవరు చేపట్టనున్నా రన్నది తేలిపోనుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలను వెల్లడించడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మీడియా ప్రతినిధులతో సోమ వారం మాట్లాడిన ఆయన ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 119 మంది అబ్జర్వర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల ఓట్లను లెక్కించనున్నారు.
కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. కౌంటింగ్ కోసం పార్లమెంటు నియోజకవర్గాలకు 2,442 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లకు 443 టేబుళ్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కోసం 2,446 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్‌కు 557 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సిఇఓ తెలిపారు. . ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని, పదిశాతం మంది సిబ్బందిని రిజర్వులో ఉంచుతున్నట్లు చెప్పారు.
కొవ్వూరు, నరసాపురంల నుండి తొలి ఫలితం
కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రాష్ట్రంలో తొలి ఫలితం వెలువడనుంది. ఈ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు మాత్రమే లెక్కించాల్సిఉండటం దీనికి కారణం. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 26 రౌండ్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలు చిట్టచివరన రావొచ్చని భావిస్తున్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో 27 రౌండ్లు లెక్కించనున్నారు. దీనికోసం తొమ్మిది నుండి పది గంటల సమయం పట్టనుంది. అలాగేరాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజవకర్గాలకు 13 రౌండ్లు మాత్రమే లెక్కించనున్నారు. 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు, మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లు లెక్కించనున్నట్లు సిఇఓ తెలిపారు. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 102 నియోజకవర్గాల్లో రెండు రౌండ్లలో ఫలితాలు వస్తాయి.
ఉదయం 11 గంటలకి ట్రెండ్
పార్లమెంటు నియోజకవర్గాల్లో 454 మంది, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది భవితవ్యం నేడు తేలనుంది.ఉదయం 11 గంటలకే ట్రెండ్ తెలిసిపోనుంది. సెల్‌ఫోన్లను కౌంటింగ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏజెంట్ల రాకపోకలపైనా స్పష్టమైన విధివిధానాలు రూపొందించారు. ఎవరైనా ఘర్షణకు దిగితే వారిని కౌంటింగ్ సెంటర్ బయటకు పంపించడంతోపాటు అరెస్టు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లేవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వచ్చేవారిని లోపలకు అనుమతించబోమని సిఇఓ ప్రకటించారు. ఈసారి అత్యధికంగా 4,88,666 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఉదయం 8.30 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఇవిఎంలు ప్రారంభిస్తారు. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లు, మరోవైపు ఇవిఎంలు కౌంటింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుండి గంటగంటకూ ఫలితాలను సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. అనంతరమే ఫలితాలు ప్రకటిస్తారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయుధ పోలీసులు, కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ సెంటర్లన్నిటినీ రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఇవిఎంల కౌంటింగ్ అనంతరం రెండు ఇవిఎంలలో పేపర్ స్లిప్పులను లెక్కించనున్నారు. దీనికోసం ఫలితాల వెల్లడి కనీసం నాలుగు నుండి ఐదుగంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా ఫలితాలు తెలిసేందుకు రాత్రి 10 గంటల వరకూ పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్లున్న రహదారులపై ఎటువంటి వాహనాలనూ అనుమతించడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్‌లు, డిజిపిలకు ఆదేశాలు జారీచేసింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి పెన్ను లేదా పెన్సిలు, ప్యాడ్, తెల్లపేపరు, ఫారం-17సిని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.