నారద వర్తమాన సమాచారం
చిలకలూరిపేట
జూన్ :20
చేసిన దోపిడీ, పాపాలకు రజిని మూల్యం చెల్లించక తప్పదు: ప్రత్తిపాటి
జగనన్న కాలనీ భూముల్లో రజిని అవినీతికి పాల్పడ్డారని ప్రత్తిపాటికి రైతుల ఫిర్యాదు
గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు, దోపిడీ, పాపాలకు విడదల రజిని మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. మరీ ముఖ్యంగా చిలకలూరిపేటలో జగనన్న కాలనీల పేరుతో ఆమె చేసిన దోపిడీ మొత్తాన్ని ఆధారాలతో సహా నిరూపించి శిక్షలు వేయిండం ఖాయమని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు అతి పెద్ద కుంభకోణమని, భూమి కొనుగోలు, మౌలిక వసతుల పేరుతో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రత్తిపాటి. గురువారం చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రుకు చెందిన పలువురు రైతులు ప్రత్తిపాటిని కలసి మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజిని చేసిన మోసాలపై తమ గోడు వెల్లబోసుకున్నారు. పసుమర్రుకు చెందిన రైతుల నుంచి 200 ఎకరాలు సేకరించి రూ.10 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ముడుపులు చెల్లించిన తర్వాతనే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రజిని కాజేసిన తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజినిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్తిపాటికి వినతిపత్రం అందజేశారు. వారి ఆవేదన మొత్తం విన్న తర్వాత మాట్లాడిన ప్రత్తిపాటి.. జగనన్న కాలనీ పేరుతో పసుమర్రులో రైతులకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేస్తామన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోనే జగనన్న కాలనీల కోసం భూమి కొనుగోలులో రూ.వందల కోట్లు చేతులు మారాయని, అందులో సింహభాగం విడదల రజిని, ఆమె కుటుంబసభ్యులు, బినామీల ఖాతాల్లోకే చేరాయన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ప్రత్తిపాటి భరోసా కల్పించారు. ఈ సందర్భంగానే పసమర్రుకు చెందిన బాధితులు మీడియాతో మాట్లాడారు.
గడిపూడి దశరథరామయ్య, రైతు
రైతు గడిపూడి దశరథరామయ్య మాట్లాడుతూ పసుమర్రులో మొత్తం 4-5 విడతల్లో 200 ఎకరాలు సేకరించారన్నారు. ఒక్కో విడతలో ఒక్కో ధరను పెట్టి భూములు తీసుకున్నారని తెలిపారు. ఈ లావాదేవీల్లో సుమారు రూ.10 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అనంతరం 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు మాట్లాడుతూ గతంలో పేదల ఇళ్ల కోసం పుల్లారావు హయాంలో 40 ఎకరాలు సేకరించారని.. అప్పుడు తమ వద్ద నుంచి రూపాయి కూడా తీసుకోలేదన్నారు. రైతుల నుంచి సేకరించిన 40 ఎకరాలకు ప్రతీ పైసాతో సహా ఇప్పించారన్నారు. కానీ 2019-24 మధ్య రజిని మంత్రిగా ఉన్నప్పుడు రైతుల నుంచి 160 ఎకరాలు సేకరిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులో వాటా తీసుకున్నారని వాపోయారు. మరీ దారుణంగా తమ వద్ద నుంచి చెక్కులు, నోట్లు తీసుకున్నారని, తర్వాత ఆ డబ్బును ఆర్టీజీఎస్ ద్వారా వారి ఖాతాలోకి బదిలీ చేసుకున్నారని తెలిపారు. రజినికి చెందిన బినామీ ఖాతాలోకి విడతల వారీగా సుమారు రూ.10 కోట్లు బదిలీ చేసుకున్నారని అన్నారు. ధైర్యం చేసి మా డబ్బులను వెనక్కి ఇవ్వమని అడిగితే కేసులు పెడతామని బెదిరించారన్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో భయపడి తామంతా నోరు మెదపలేకపోయామన్నారు జాలాది. గొర్రెల మండీ రోడ్‌కు అడ్డుగా గోడ కట్టి విడదల లక్ష్మీనారాయణ రూ.కోటి అడిగారని వెల్లడించారు. డబ్బు చెల్లించలేదని గోడ కట్టి దానిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారడంతో వాళ్లే గోడ తొలగించారని.. ప్రస్తుతం అక్కడ రాకపోకలు సాగుతున్నాయన్నారు. దాన్ని కూడా పసుమర్రు పంచాయతీకి రాపించి ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. రైతుల వద్ద రజిని కొట్టేసిన డబ్బులను కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ఇన్నిచేసిన విడదల రజిని ఇప్పుడు ఈ కుంభకోణం చుట్టుకుంటుందనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు పసుమర్రు రైతు. కానీ రజిని లాంటి అవినీతిపరులను బీజేపీ చేర్చుకుంటుందని తామంతా భావించడం లేదని… ప్రధాని మోదీ నేతృత్వంలోనే బీజేపీ ఇలాంటి వారిని అస్సలు ప్రోత్సహించరని ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.