నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్ఐపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక… అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్ లతో పాటు ఎస్ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.