Wednesday, December 3, 2025

బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ రమావత్ లాల్ సింగ్ పి హె.చ్డి స్కాలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం

బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ

రమావత్ లాల్ సింగ్
పి హె.చ్డి స్కాలర్
ఉస్మానియా విశ్వవిద్యాలయం

నారద వర్తమాన సమాచారం .

నిజామాబాద్ జిల్లా,

బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది
తీజ్ పండుగ’ తీజ్ అనగా గోదుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఈ పండుగ ముఖ్య ఉద్ధేశ్యం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం ఆ రోజు తాండ నాయకుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండ నాయక్ ఇతర తాండ పెద్దలను గౌరవించడం. తాండలో వర్షాలు బాగా కురిసి ప్రతి తాండ ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఎప్పుడు పచ్చగా హరిత భరితంగా ఉండడం. పెళ్ళి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని అన్ని కోరికలు నెరవేరాలని అమ్మాయిలు కోరుకోవడం.ఈ తీజ్ పండుగ మొదట ఎలా ప్రారంభమవుతుందంటే తాండల్లోని అందరు తాండావాసులు ఆ తాండకు చెందిన ముఖ్యమైన నాయకున్ని నాయక్ ” అంటారు. అతని ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని “నాయక్” అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకొని వస్తారు. ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో, గవ్వలతో, ముత్యాలతో పూసలతో బాసింగాలు కట్టి పెళ్ళి కూతురులా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు. ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణపూర్ణిమ రోజు ఉదయం లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందంగా ముస్తాబై కొత్తబట్టలు ధరించి “నాయక్ ” ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆ మట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి తాండ నాయకుని ఇంటి ఆవరణలో అందరు సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్ భార్య నాయకణ నాన బెట్టిన గోదుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది
ఈ పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు.
పెళ్ళికాని అమ్మాయిలు అందరు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా “మోదుగు” ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోదుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడ పిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు. ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు “పులియాగెణో” పూర్ణకుంభం తలపై పెట్టుకొని బావి నీళ్లుకాని, బోరింగ్ నీళ్ళుకాని, చెరువు నీళ్లుకాని, తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కి నీళ్ళ పోయ్యనివ్వకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పినవారికి తీజ్ కి నీళ్ళు పొయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నీళ్ళు జల్లుతూ అగరు బత్తులతో దూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు

ముగింపు రోజు

తీజ్ నిమజ్జనం కంటే ఒక రోజు ముందు డంబోళి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నాన బెట్టిన సెనగలను తీసుకొని పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు. అప్పుడు ఆడ పిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమిస్తారు.అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకొని నాయక్ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగవాళ్ళు ఆ మట్టితో డోక్రి,డోక్రా ముసలమ్మ ముసలోల్లను ఒక పీటపై తయారు చేస్తారు. దానినే గణగోర్ అంటారు. తయారు చేసిన మట్టి బొమ్మల పై రైక బట్ట, తువ్వాల కప్పుతారు.”డంబోళి” రోజు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటలకు తాండ వాళ్లందరూ బోజనం చేసిన తర్వాత గోదుమ పిండితో తయారు చేసిన గోదుమ రోట్టె, బెల్లం, నెయ్యితో కలిపి ఉండలు తయారుచేస్తారు. దానిని చుర్మో అంటారు. తయారు చేసిన చుర్మోను హారితి పెళ్ళెంలో వేసి అగరుబత్తులు కొబ్బరికాయ కుంకుమ, నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళికాబోయే ఆడ‌పిల్లలతో తాండ నాయక్ ఇంట్లో డోక్రి, డోక్రాకు పూజలు చేసి డంబోళి పైన పాటలు పాడుతు నృత్యాలు చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆడ పిల్లలందరు డోక్రి, డోక్రాను నెత్తి మీద పెట్టుకొని ఊరి బయట ఉన్న చెరువులో గణగోర్ ని నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్ గుల్లలను మధ్యలో పెట్టుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు పెద్దలు నాయక్, కార్భారి, ఢావ్, ఢవ్ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం బాలాజీ బండారో చేస్తారు. నాయక్ అగరు ఒత్తులు వెలిగించి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం ఆడపిల్లలు తమ తీజ్ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆ గుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ ని తెంపుతారు.తెంపిన తీజ్ ని ఆడ పిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు.గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడపిల్లలు తీజ్ ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కొక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు. ఒక్కొక్కరు తీజ్ ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తీజ్ ని మొక్కతూ పెళ్ళికాని వారు హారాలకి పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్ నాయకణ్ జొన్నలు, గోదుమలు, సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరు తినటం, ఆ తర్వాత ఎడ్లకు ఝూలు వేసి అలంకరించి, బండి కట్టి అందులో తీజ్ ని ఉంచి బాజా బజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండ చెరువులో తీజ్ గుల్లలని చివరి రోజున నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో ఆడ పిల్లలు బాదపడటం ఏడ్వటం చేస్తారు. ఎందుకంటే తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధ లతో, పాటలతో, నృత్యాలతో ఆనందంగా జరుపుకోని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈ తీజ్ ఉత్సవం జరుపుకోలేమన్న బాదతో ఏడుస్తారు. తీజ్ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు.
అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్ ఆధ్వర్యంలో గుడాలను అందరికి పంచి పండుగను ముగిస్తారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version