నారద వర్తమాన సమాచారం
ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
*జెండాను ఆవిష్కరించిన ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్*
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్లు నేటితో పూర్తవుతోంది. ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనం ఓసారి స్మరించుకోవాలి. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలి. మన దేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించారు. వారి వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు. కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు. సంపదను, ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారీ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి. మనందరం కులం, మతం, భాష, ప్రాంతాలవారీగా కాకుండా భారత పౌరులుగా గుర్తింపును పొందాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలషిద్దాం.
అలాగే శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది. స్వాతంత్ర్య పొందినప్పటి నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. ఉపగ్రహాలను ప్రయోగించడం దగ్గర నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు మన దేశం ప్రపంచ వేదికపై గుర్తింపును సాధిస్తూనే ఉంది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువ పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం మన బాధ్యత. భారతదేశాన్ని బలంగా, స్వతంత్రంగా ఉంచడానికి మన వంతు సాయాన్ని చేద్దాం. మన దేశ సంస్కృతి విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగస్వామి, యాదాద్రి జిల్లా కమిటీ సభ్యులు రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, కోళ్ల సైదులు, వలిగొండ మండల ప్రెసిడెంట్ ఐతరాజు అశోక్, చౌటుప్పల్ మండల వైస్ ప్రెసిడెంట్ దశరథ, ఎర్ర శంకరయ్య, రోశనగరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.