నారద వర్తమాన సమాచారం
ప్రజల వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టం నిర్వీర్యమవుతుందా..?
21 ఏళ్లైనా సామాన్యుడికి అందని చట్టం – ప్రభుత్వాల వైఫల్యంపై రాపోలు లింగస్వామి ఫైర్
ఎల్ బీ నగర్
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు పునాది అయిన సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) అమల్లోకి వచ్చి దాదాపు 21 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, నేటికీ సామాన్య ప్రజలకు అది అందని ద్రాక్షలా మారిందని ఆర్‌టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ గ్రహీత, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ గ్రహీత రాపోలు లింగస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యటించి, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సూచిక బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. అనేక కార్యాలయాల్లో అసంపూర్తి వివరాలు, కొన్ని చోట్ల ఫోన్ నంబర్లను కాగితాలతో మూసివేసిన బోర్డులు దర్శనమిచ్చాయని పేర్కొన్నారు. ఇది చట్టాన్ని అమలు చేస్తున్న తీరు కాదని, కేవలం పేరుకే ఉన్న ఏర్పాట్లుగా ఉన్నాయని విమర్శించారు.ఇలాంటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కాదా? అని లింగస్వామి ప్రశ్నించారు. అలాగే తక్షణమే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పూర్తి సమాచారంతో కూడిన ఆర్‌టీఐ సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.రాజధాని హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, గ్రామ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం అమల్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్‌టీఐ అంటే ఏమిటి?, ఏ కార్యాలయంలో ఎవరి వద్ద సమాచారం కోరాలి?, దరఖాస్తు ఎలా చేయాలి? అనే విషయాలపై సరైన అవగాహన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఉన్న గొప్ప వజ్రాయుధం అని, అవినీతిని ప్రశ్నించే శక్తిని సామాన్యుడికి అందించిన చట్టమని లింగస్వామి గుర్తు చేశారు. అంతటి గొప్ప చట్టాన్ని ఆచరణలో నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించి, సమాచార హక్కు చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







