నారద వర్తమాన సమాచారం
ఢిల్లీకి రేవంత్.. హైకమాండ్‌తో కీలక భేటీ.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ ఇన్‌ఛార్జ్ కలిసి వెళ్తుండటంతో ఈసారి తప్పకుండా మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశం అయినప్పటికీ మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కులగణనపై..
హైకమాండ్‌తో భేటీ సందర్భంగా తెలంగాణలో కులగణనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన పూర్తిచేయాలా.. ఎన్నికల తర్వాత చేయాలా అనేదానిపై అగ్రనేతలతో చర్చించనున్నారు. కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌తో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.
రాహుల్, సోనియాకు ఆహ్వానం..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో తెలంగాణలో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. గత ఢిల్లీ పర్యటన సమయంలోనే సోనియా, రాహుల్ తేదీలను రేవంత్ రెడ్డి అడిగారు. అయితే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతున్న వేళ అతి త్వరలో రైతు కృతజ్ఞత సభను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈసభకు సోనియా, రాహుల్‌ను ఆహ్వానించనుండగా.. ఇద్దరిలో ఎవరో ఒకరు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్‌ను రేవంత్ ఆహ్వానించనున్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.