Thursday, November 21, 2024

దసరా నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దుర్గ అవతారము

నారద వర్తమాన సమాచారం

శైలపుత్రి దుర్గ దేవి..🔱

దసరా నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దుర్గ అవతారము

శైలపుత్రి దుర్గ దేవి..🔱

శైలపుత్రి దుర్గా, అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఈ అమ్మవారికి ఉన్నాయి.

శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు.

పురాణ గాథ
నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతీ, హైమవతీ అని కూడా పిలుస్తారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గా దేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి.

తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపంతో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి, శివుణ్ణీ, సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు.

నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దనీ, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు.

శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రిదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి (హిమవంతుడు) నుంచి భర్త (శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రిదేవి.

మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది.

శైలపుత్రిదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రి దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రిదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రిదేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

ధ్యాన శ్లోకం

వందే వాంఛిత్ లాభం, చంద్రార్ధకృతశేఖరం |
వృషారూఢాం శూల్దారాం శైలపుత్రిం యశస్వినీమ్ ||

భావం: శిరస్సుపై చంద్రబింబంతో అలంకరించబడి, వృషభాన్ని అధిరోహించి, త్రిశూలాన్ని ధరించి, విశిష్టమైన మా కోరికలు నెరవేరాలని నేను శైలపుత్రి దేవిని పూజిస్తాము.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version