నారద వర్తమాన సమాచారం
ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావుపేట
జిల్లాలో ఇసుక కొరత లేదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారికి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇసుక నిర్వహణ కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్ సైట్ ద్వారా ప్రజలు నేరుగా లేదా సంబంధిత సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచిత ఇసుక పొందవచ్చన్నారు. ప్రజలు ఎవరూ ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలతో స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లవద్దని, ఇసుక కొరత పుకార్లు నమ్మి దళారుల వద్ద అధిక ధరలకు ఇసుక కొనవద్దని విజ్ఞప్తి చేశారు.
అక్టోబరు 16 నుంచి జిల్లాలోని 6 ఇసుక రీచులలో 4,23,300 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు సిద్ధంగా ఉండనుందన్నారు. రానున్న రోజుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టి, స్టాక్ పాయింట్ల వరకూ ఇసుక తరలించేందుకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 20 నాటికి 6 రీచుల ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు వస్తే మరో 5 డీసిల్టేశన్ పాయింట్లలోని 5,29,050 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆన్ లైన్ లేదా సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇసుకను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. స్టాక్ పాయింట్ల నిర్వహణ ఖర్చు, ట్యాక్సులు, రవాణా ఖర్చు మాత్రం ప్రజలు చెల్లించాల్సివుంటుందన్నారు. ప్రస్తుతం అచ్చంపేట మండలం మాదిపాడు స్టాక్ పాయింట్ నుంచి సరఫరా చేస్తున్న ఇసుకపై వినియోగ దారుడు నిర్వహణ ఖర్చులు, ఇతర పన్నులు కలిపి కేవలం టన్నుకు రూ.183 లు మాత్రం చెల్లించాల్సివస్తోందన్నారు. రవాణా ఖర్చులు సైతం రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఏకీకృతం చేయడం జరిగిందన్నారు.
ఇసుక విషయంలో అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుకింగ్ చేసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న అంశానికే ఇసుక వినియోగిస్తున్నాడా, లేదా అనేది సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా ధృవీకరణ చేయిస్తామన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుంచి 1800 425 6029 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఇసుక అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సుల ద్వారా అక్రమాలను అడ్డుకుంటామన్నారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు అమ్ముకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి నాగయ్య, దాచేపల్లి మైన్స్ ఏడీ ప్రకాశ్ కుమార్, డీపీఆర్వో ఓం ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.