Friday, November 22, 2024

భగినిహస్త భోజనము సాంప్రదాయ వివరణ…!

నారద వర్తమాన సమాచారం

నేడు అన్నా చెల్లెలు భోజనాలు ( భగినిహస్త భోజనము)

కార్తీకమాసంలో రెండో రోజు శుద్ధ విదియను యమ ద్వితీయగా, భ్రాతృ ద్వితీయగా, భ్రాతృ విదియగా, భగినీ హస్త భోజన పర్వదినంగా పేర్కొంటారు.
“భగని హస్తభోజనం” అంటే సోదరి చేతివంట సోదరుడు తినడం.

సమాజం అనుసరించాల్సిన ధర్మాలను, ఆచారాలను, వ్రతాలను పండుగల పేరిట సంప్రదాయం ప్రతిపాదించింది.

ఆ కోవలోనిదే యమ ద్వితీయ.
కార్తిక శుద్ధ విదియనాడు భ్రాతృ పూజనం గురించి “లింగ పురాణం” ప్రస్తావించింది.

శ్లో౹౹ కార్తికేతు ద్వితీయాయాం!
శుక్లాయాం భ్రాతృపూజనం!
యా నకుర్యాత్ వినశ్యంతి!
భ్రాతరస్సప్తజన్మసు!!
(లింగపురాణం)

ఈ తిథినాడు సోదరీమణుల ఇంట భోజనాన్ని సోదరులు ఆరగించాలని “భవిష్య పురాణం” చెబుతోంది.

తోబుట్టువు అనురాగాలకు, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక. అపురూపమైన సహోదరుల బాంధవ్యానికి మరింత బలాన్ని చేకూర్చే ఈ భ్రాతృ విదియ పురాణ ప్రశస్తి చెందింది.

సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ., అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు.

సోదరి సొమ్మును తిని ఆమె ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఓ కథ కూడా ఉంది.

నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడట. ఆయనకు ఆమె విజయ తిలకం దిద్ది, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిన దరిమిలా- ఆ పవిత్ర తరుణం భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.

శ్లో౹౹ అస్యాం నిజగృహే పార్ధ!
నభోక్తవ్యంమతోబుధైః!
యత్నేన భగినీహస్తాత్!
భోక్తవ్యం పుష్టివర్ధనం!!
(భవిష్యపురాణం)

యమ ద్వితీయను పాటించే విధివిధానాల్ని భవిష్య పురాణం వివరించింది. యముడి దశ నామాల్ని స్మరించి, అర్ఘ్య ప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతి అయిన ఆయన ప్రీతి కోసం, దక్షిణ దిక్కున ఆవు నేతితో యమ దీపం వెలిగించాలి. సోదరీమణుల ఇంట్లో భోజనం చేసి, వారికి నూతన వస్త్రాల్ని బహూకరించాలి.

కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమ ద్వితీయ. సోదర సోదరీమణుల ఆత్మీయ భావనను ఈ పర్వదినం అభివ్యక్తం చేస్తుంది. ఇదే సందర్భంలో కాంతి ద్వితీయ లేదా పుష్ప ద్వితీయ అనే వ్రతాన్ని ఆచరిస్తారని ‘చతుర్వర్గ చింతామణి’ వెల్లడిస్తోంది. యమ పూజతో పాటు చిత్రగుప్త, విశ్వకర్మ ఆరాధనల్నీ నిర్వహిస్తారు.

సహోదరుల మధ్య అవగాహన, ఆపేక్షల వృద్ధికి ఉద్దేశించిన భగినీ హస్త భోజనం అపురూప సన్నివేశం. పుట్టింటి మమకారాలు మహిళలకు అపారమైన మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సంస్కారయుతమైన, సద్భావన భరితమైన సౌమనస్య తత్వానికి ప్రతీక- భగినీ హస్త భోజన పర్వదినం!

పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గరున్న దాన్ని ఎదుటివారికి ఇవ్వడాన్ని నేర్పిస్తాయి, ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడాన్ని నేర్పిస్తాయి.

భగిని హస్త భోజనం అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం, ఎందుకు చేయాలో మరో పురాణగాధ కూడా ఉన్నది.

ప్రసిద్ధపురాణగాధ

సూర్యభగవానునికి ఉన్న సంతానాలలో యమునా నది యముడికి (యమధర్మరాజుకి) చెల్లెలు. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని కూడా అంటూ ఉంటారు! చెల్లయిన యమునా నదికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడూ అన్నగారిని ఆమె ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరేది. చెల్లెలి మాటని కాదనలేక చిత్రగుప్తునితో, తన పరివారంతో సహా యమలోకాన్ని, తన పనులను వదిలేసి భూలోకం వస్తాడు యముడు. అలా వచ్చిన రోజే ఈ కార్తీక శుద్ధ విదియ. అందువలననే దీనిని యమ ద్వితీయ అని కూడా సంబోధిస్తారు. సరే అలా వచ్చిన అన్న గారిని చూసి యమున ఎంతో సంతోషించి వాళ్ళందరికీ అతిధి సత్కారాలు చేసి, ఎంతో ప్రేమాభిమానాలతో వంట చేసి అందరికీ వడ్డించి విందుభోజనం పెట్టిందిట. ఆమె ఆప్యాయత, అనురాగాలకి మురిసిపోయిన యముడు ఒక వరం కోరుకోమన్నాడుట. అప్పుడు యమున ప్రతీ ఏడాది ఈ రోజు (అనగా కార్తీక శుద్ధ విదియ) తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని కోరిందిట. సొంత అక్కా, చెల్లెళ్లు లేకపోతే వరస వాళ్ళ ఇంట్లోనయినా భోజనం చేయాలి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆనాడు యముడు తన చెల్లెలి ఇంటికి వచ్చి తన చేతివంట తిని వెళతానని ఆమెకు మాట ఇచ్చాడు.

లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు. కనుక అప్పటినుండి మనం ప్రతీ సంవత్సరం దీనిని జరుపుకుంటున్నామనమాట.
శుభం భూయాత్ !


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version