నారద వర్తమాన సమాచారం
కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా ఖచ్చితంగా పోస్టులు పెడతాం..
మాజీమంత్రి రోజా ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం.. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి.. ప్రతిపక్ష వైసీపీకి మధ్య సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంలో తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతూ పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు చేస్తుంటే అరెస్ట్ చేయరా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ట్విటర్ వేదికగా స్పందించారు. ఎన్నికల వేళ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా బడ్జెట్‌లో నిధులు కేటాయించక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలను మోసం చేస్తున్నారని మోసం చేస్తున్నారని.. రోజా మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై తనతోపాటు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తూ ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతూనే ఉంటారని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని యువత, మహిళలను, రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
ఆడబిడ్డ నిధి పేరుతో రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారని తెలిపిన రోజా.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. ఇక దీపం పథకం కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని.. అయితే 1,54,47,061 గ్యాస్ కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బడ్జెట్‌లో ఎన్ని కోట్లు కేటాయించారని నిలదీశారు. మరోవైపు.. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తా అన్నారని.. రాష్ట్రంలో ఉన్న 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఎంత మందికి ఇచ్చారని రోజా ప్రశ్నించారు.
అన్నదాత పథకం కింద.. రాష్ట్రంలో ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తా అన్నారని.. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవసరం కానుండగా.. అందులో ఎంత ఇచ్చారని నిలదీశారు. ఉచిత బస్సు పథకంలో భాగంగా.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుండగా.. ఇప్పటి వరకు అతీగతీలేదని మండిపడ్డారు. యువగళం కింద రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని.. నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అని అన్నారని.. దీని ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి.. ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారని.. ఒక్కొక్కరికీ రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు ఇస్తా అన్నారు.. అందుకు మొత్తం రూ.8,160 కోట్లు కావాలి.. ప్రభుత్వం ఎంత ఇచ్చిందని రోజా ప్రశ్నించారు. వైసీపీ నేతలు ప్రశ్నిస్తే కేసులు పెడుతామని.. అరెస్టులు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.