నారద వర్తమాన సమాచారం
గ్రామాల్లో కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీ ఏర్పాటు: పవన్ కల్యాణ్
అమరావతి:
గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీని కోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు..
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగిందని.. నూతనంగా జనాభాను కూడా జోడించి పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని అధికారులకు సూచించారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండే సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా క్లస్టర్ గ్రేడ్ల విభజన చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉండాలన్నారు. వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం చెప్పారు..
కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా ఒక యూనిట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికన జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కమిటీ పరిశీలిస్తుంది. వీటిని కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి కమిటీ నివేదించనుంది. దీనిని అనుసరించి గ్రేడ్ల ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.