నారద వర్తమాన సమాచారం
ఢిల్లీలో మరోసారి హస్తం పార్టీకి తీవ్ర పరాభవం.. మూడోవసారి తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఎటొచ్చి ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ తప్పలేదు.
పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ గతంతో పోల్చితే కొద్దిగా ఓట్ల శాతం పెరగడం మినహా ఆ పార్టీకి సంతృప్తినిచ్చిన అంశం ఇంకొకటి లేదనే చెప్పాలి.
1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలగా వ్యవహరించింది. 2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమైంది. తర్వాత 2015 ఎన్నికల్లో 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలవలేదు.
అయితే ఆప్‌తో పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఢిల్లీని పట్టి పీడిస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు రాహుల్‌గాంధీ స్వయంగా యమునాలో బోటులో పర్యటించారు. అయితే అది పెద్దగా ప్రభావం చూపలేదని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.