నారద వర్తమాన సమాచారం
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
గన్నవరం వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికీ 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు.
మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. ” వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చాం. ఈ కేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారు” అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
తెదేపా కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం ఉదయం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా.. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో సత్యవర్దన్ వాగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణ లంక పోలీస్‌ష్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతోపాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.