Saturday, April 19, 2025

విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని ‘మీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’ అని అడిగేవాళ్ళట.

నారద వర్తమాన సమాచారం

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*భగవంతుడి మాట*

విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని ‘మీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’ అని అడిగేవాళ్ళట.

“ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం!” అనేవాడట ఐన్-స్టీన్.

స్పినోజా 17 వ శతాబ్దపు డచ్ తాత్వికవేత్త. అతడు చెప్పినదాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు. ఓ సారి చూడండి !

దేవుడు మనిషికి చెప్పేది… స్పినోజా మాటల్లో ….

“…ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి. సృష్టి సర్వం తో మమేకం కండి. హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.

ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా! పర్వతాలూ, చొరలేని అరణ్యాలూ, నదులూ, సరోవరాలూ , సాగరతీరాలూ… ఇవీ నా నివాసాలు.

మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి. మీ తప్పటడుగులూ, పాపాలతో నాకు ప్రమేయం లేదు.

మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.

ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను. ఏవో పుస్తకాల పుటల్లో కాదు.

అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను, నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ, పట్టింపులూ ఉండవు. క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.

నీ పరిధులూ , పరితాపాలూ , ఉద్వేగాలూ , సుఖాలూ అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను ?.

నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి? నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.

బతుకంటే అదేదో పరీక్ష కాదు. ఒక రిహార్సల్ కాదు. ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు. ఇక్కడ నడిచే , గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని.

పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు. శిక్షలూ , పురస్కారాలూ , పాపాలూ , సద్గుణాలూ నా నిఘంటువులో మాటలు కాదు. ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి. ఆ స్వేఛ్చ నీదే.

ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో , లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు , ఇంకేం విస్మరించావు – అనే లెక్కలు నేను తిరగదోడను.

నన్ను నమ్మకు. నమ్మడం అన్నది ఊహాత్మకం. నిన్ను నువ్వు నమ్ముకో. ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో , ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తురావడమే నేను ఆశించేది.

నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి. వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని? నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ, సంతోషాలూ సరిచూసుకో. అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.

నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో. చిక్కుముడి అదంతా. అద్భుతాలూ , వాటికి అన్నేసి వివరణలూ దేనికి?

నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్. అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు…?✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version