నారద వర్తమాన సమాచారం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నేరుగా ఫిర్యాదిదారుల వద్దకే వెళ్లి అధికారుల స్పందనపై ఆరా
నాదెండ్ల మండలంలో ఫిర్యాదిదారులను కలిసిన జిల్లా కలెక్టర్
ప్రతి శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్లు అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని ఆదేశాలు జారీ
నరసరావు పేట,
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టరేట్ కు వచ్చి ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు అధికారుల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు నేరుగా ఫిర్యాదిదారులను వారి సొంత గ్రామంలోనే కలిసి మాట్లాడే కార్యక్రమం చేపట్టారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ నాదెండ్ల మండలంలో పర్యటించి అప్పాపురం, ఇర్లపాడు గ్రామం నుంచి అందిన ఫిర్యాదులపై అర్జీదారులతో మాట్లాడారు.
అప్పాపురం గ్రామ జనాభాను దృష్టిలో ఉంచుకుని నూతన గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ అందిన ఫిర్యాదుపై అర్జీదారుడు మస్తాన్ వలీ తో మాట్లాడారు. ప్రస్తుత గ్రామ సచివాలయం 10 కిమీ దూరంలో ఉండటం, గ్రామ జనాభా 3000 పై చిలుకు ఉండటం వంటి అర్జీదారుడు పేర్కొన్న అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
అనంతరం తన భూమి హద్దులు నిర్ణయించే విషయంపై అధికారులు కొలతలు నిర్వహించకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసిన ఇర్లపాడు వాసి రంగనాథుల బ్రహ్మయ్యతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వెంటనే సర్వే నిర్వహించాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేను ఆదేశించారు.
గ్రామంలో మిరప పంటను ఎండబెట్టడం గమనించిన జిల్లా కలెక్టర్.. మంచు, వర్షం కారణంగా మిరపలో తేమ శాతం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే ప్రతి సోమవారం మధ్యాహ్నం అర్జీదారులతో ఫోన్ లో మాట్లాడి వారికి సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి కొనసాగింపుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మరింత ఫలప్రందంగా నిర్వహించేందుకు అర్జీదారులను నేరుగా కలిసే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే సరైన పరిష్కారం దక్కుతుంది, అవసరమైతే అధికార యంత్రాంగం మొత్తం కదిలివస్తుంది అనే భరోసా ప్రజలకు కల్పిస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు
మండల స్పెషల్ ఆఫీసర్లు సైతం ఫిర్యాదుల పరిష్కారాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులతో మాట్లాడారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.