సాయిరెడ్డికి బీజేపీ బిగ్ ఆఫర్..
నారద వర్తమాన సమాచారం
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో కొనసాగుతూనే బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసింది.
ఏపీ కేంద్రంగా జాతీయ స్థాయి వరకు పదవుల ఖరారులో కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. ఏపీలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది.
అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగుతోంది. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించిన సాయిరెడ్డికి బీజేపీ నుంచి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చగా మారింది.
బీజేపీ కొత్త వ్యూహం
ఏపీలో బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. జాతీయ అధ్యక్షుడు.. ఏపీ బీజేపీ అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా తమ బలం పెంచుకోవటమే లక్ష్యంగా కార్యాచరణకు తుది రూపు ఇస్తోంది.
వైసీపీలో ముఖ్య నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను ఏ పార్టీలో నూ చేరటం లేదని… వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. జగన్ కోటరీ అంటూ వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసారు. జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల వేళ.. మద్యం, కాకినాడ పోర్టులో పార్టీలోని ముఖ్యల పేర్లను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, రాజ్యసభ సభ్యత్వానికి సాయిరెడ్డి రాజీనామా చేసారు.
సాయిరెడ్డి నిర్ణయం మార్పు..!
వైసీపీకి రాజీనామా చేసే సమయంలోనే సాయిరెడ్డి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం సాగింది. కాగా, సాయిరెడ్డి తాన ఏ పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాయిరెడ్డి బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతల్లోనే ఈ చర్చ మొదలైంది.
ఏపీలో సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తిరిగి బీజేపీ నుంచి సాయిరెడ్డికే కేటాయించనున్నట్లు చెబుతున్నారు. సాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి దక్కేలా ఇప్పటికే కూటమిలో నిర్ణయం జరిగింది. వైసీపీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి ఎన్నికైన విధంగానే సాయిరెడ్డి విషయంలో జరగనుందని ఢిల్లీలోని బీజేపీ నేతల సమాచారం. అయితే, సాయిరెడ్డి కూటమి పార్టీల్లో చేరిక పైన టీడీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.
తిరిగి రాజ్యసభకు
సాయిరెడ్డి వైసీపీ వీడిన సమయంలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, కూటమి లో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆయన రాక పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. వైసీపీలో నెంబర్ టూగా..తమ ను ఇబ్బంది పెట్టిన సాయిరెడ్డికి అవకాశం ఇవ్వ ద్దని సూచించినట్లు అప్పట్లోనే బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో చెప్పుకొచ్చారు. దీంతో, కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకునే విధంగా సాయిరెడ్డి ముందుగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పుడు రాజ్యసభ సీటు భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సమయంలో బీజేపీ తిరిగి సాయిరెడ్డికే అవకాశం ఇవ్వనుందని భావిస్తున్నారు. అయితే.. సాయిరెడ్డి బీజేపీలో చేరటం ద్వారా ఏపీలో భవిష్యత్ రాజకీయాల పైన ఆ పార్టీ నేతలు స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి.. సాయిరెడ్డి బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్తారా.. లేక, రాజకీయాలకు దూరంగానే ఉంటారా అనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.