నారద వర్తమాన సమాచారం
ప్రధాని మోదీ సభకు రాజధానికి తరలి వచ్చే వారికోసం రవాణా- వసతిని కల్పించిన కూటమి ప్రభుత్వం
ప్రధాని మోదీ అమరావతి టూర్ – సభకు 5 లక్షల మంది , 6600 బస్సులు
అమరావతి పునర్‌నిర్మాణ పనులు పెద్దఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు.
ఒక్కొక్క బస్సులో 120 ఆహారపొట్లాలు, 100 అరటిపండ్లు, 120 నీటిసీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల వద్దకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది.
కిచిడి, చట్నీతోపాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు. తిరుగు ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గమధ్యలో ఉన్న ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. సభాప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ ఆరుగురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇంఛార్జ్ అధికారి సమన్వయం చేసుకుంటారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని రానున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవాడ కలెక్టరేట్లో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా ప్రజా ప్రతినిధులకు మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి దిశానిర్దేశం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.