నారద వర్తమాన సమాచారం
రప్పా రప్పా’ అంటే.. ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్: చంద్రబాబు
అనంతపురం సభలో మాజీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
‘రప్పా రప్పా’ అంటూ రంకెలేస్తే చూస్తూ ఊరుకోబోమని ఘాటు హెచ్చరిక
రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
”గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్‌కు సూటిగా సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని, అందుకే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రాకుండా ‘రప్పా.. రప్పా..’ అంటూ బయట రంకెలేస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడరని… ఇక్కడున్నది ఎన్సీబీ, పవన్ కల్యాణ్ అని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ”గుర్తుంచుకోండి.. ఇక్కడ ఉన్నది నేను, పవన్ కల్యాణ్. హింసను ప్రేరేపించేవారు ఎక్కడున్నా వదిలిపెట్టం” అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని హితవు పలికారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఒంటిమిట్ట, పులివెందులలోనే ప్రజలు వైసీపీ బెండు తీశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మెడికల్ కాలేజీల అంశంపై జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ”అసలు మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి వాటి గురించి మాట్లాడుతున్నారు. కేవలం భూమి కేటాయించి, పునాది రాయి వేయగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు” అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి వదిలేస్తే, వాటిలో ఒక్కటి మాత్రమే పూర్తయిందని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చకు వస్తే ఎవరేం చేశారో ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.