నారద వర్తమాన సమాచారం
భారత్ వార్నింగ్‌కు పాక్ స్ట్రాంగ్ కౌంటర్
ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచే పాక్ మాయమవుతుందన్న భారత ఆర్మీ చీఫ్
భారత్ నుంచి వస్తున్నవి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్న పాకిస్థాన్
మీ విమానాల శిథిలాల కిందే సమాధి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి
భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. భారత సైనిక, రాజకీయ నాయకత్వం నుంచి వస్తున్న హెచ్చరికలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత్‌ను తమ యుద్ధ విమానాల శిథిలాల కిందే సమాధి చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొన్ని రోజుల క్రితం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచే పాకిస్థాన్‌ను తుడిచిపెడతామని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వస్తున్నవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దెబ్బతిన్న తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికే భారత నేతలు విఫలయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“గతంలో 0-6 స్కోరుతో ఓటమి చవిచూశారు. మళ్లీ ప్రయత్నిస్తే, ఈసారి స్కోరు అంతకంటే ఘోరంగా ఉంటుంది” అని ఆసిఫ్ అన్నారు. అయితే, ఈ ‘0-6’ స్కోరు ఏమిటనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ప్రచారానికి ఇది సంకేతంగా భావిస్తున్నారు.
మరోవైపు, దేశ సమగ్రతను కాపాడేందుకు అవసరమైతే ఏ సరిహద్దునైనా దాటడానికి వెనుకాడబోమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సర్ క్రీక్ వద్ద పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా చరిత్ర, భూగోళం రెండింటినీ మార్చేసేంత గట్టి సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.