ధాన్యం కొనుగోలు నిర్వాహణ తీరు,మౌలిక సదుపాయాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహన్…
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 15,
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ తీరు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహన్ సంతృప్తి వ్యక్తం
చేశారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఒడుదుడుగులు లేకుండా సజావుగా, వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతం పరిశీలించి కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోనెసంచుల కొరత లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ, సహకార అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి,మద్దతు ధరపై రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. రెవిన్యూ, పౌరసరఫరాల, మార్కెటింగ్, వ్యవసాయ, ఐకెపి వంటి అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేపట్టాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా చూడాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. ఎప్పటికప్పుడు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ట్యాబులల్లో ఎంట్రీ చేసి సకాలంలో డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా రైస్ మిల్లులో యజమానులు తమ లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. గడువులోపు పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహణపై అధికారులకు, రైస్ మిల్లు యజమానులకు చౌహన్ అవగాహన కల్పించారు. వ్యాగన్లు, గోడౌన్ లో స్థలాల కోసం తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైస్ మిల్ యజమానుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. గత యాసంగితో పోలిస్తే ఏడాది ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించామని తెలిపారు. అంతకు ముందు బిక్కనూరు మండలం బస్వాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మౌలిక వసతుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు వసతులు ఏర్పాటు చేసినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 22,894 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి 13 కోట్ల రూపాయలు రైతులకు అందజేశామని తెలిపారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదని చెప్పారు. ప్రతి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌరసరపర అధికారి మల్లికార్జున బాబు, జిల్లా పౌరసరపర ఇంచార్జ్ మేనేజర్ నిత్యానంద్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.