నారద వర్తమాన సమాచారం
విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో మెగా పీటీఎం 2.0
పచ్చని తోరణాలతో కళకళలాడిన విద్యాలయాలు
ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన తల్లిదండ్రులు
నరసరావు పేట,
విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో సమానంగా తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వ్యాఖ్యానించారు. స్కూల్ కి పంపిస్తున్నాం, ఉపాధ్యాయులదే బాధ్యత అనే ఆలోచన తల్లిదండ్రులు విడనాడాలన్నారు. పిల్లల ప్రవర్తన, మార్కులు తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. బడి నుంచి వచ్చిన పిల్లల కోసం కనీసం ఒక అరగంట కేటాయించాలని, సెల్ ఫోన్లు ఇచ్చి తమ పనుల్లో మునిగిపోవద్దన్నారు. వారానికోసారి పాఠశాలను సందర్శించి పిల్లల చదువుల గురించి ఆరా తీయాలన్నారు.
గురువారం ఉదయం సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీటీఎం 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో సున్నితంగా ప్రవర్తించాలని, గురువుల ప్రవర్తనను పిల్లలు అనుకరిస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. చదువుతో పాటూ క్రమశిక్షణ ముఖ్యమని, క్రమ శిక్షణ లేని విద్యతో ఉపయోగం లేదని విద్యార్థులకు హితబోధ చేశారు.
ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు మన జిల్లానుంచే నమోదైన విషయాన్ని గుర్తు చేసి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
విద్యార్థుల చేత తల్లులకు పాద పూజ, తాగు లాగుడు పోటీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, ఆర్డీవో రమణా కాంత్ రెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
పండగ వాతావరణంలో పీటీఎం 2.0
గురువారం ఉదయం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 ( పీటీఎం 2.0) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పచ్చని తోరణాలతో అలంకరించిన విద్యాలయాలు తల్లిదండ్రులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. చదువుల విషయంలో తమ పిల్లల పురోగతి చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.