నారద వర్తమాన సమాచారం
ఉచిత ఆర్‌టీసీ బస్సు సౌకర్యం.. తిరుమల కొండ పైవరకు పొడిగింపు: కొనకళ్ల నారాయణరావు
ఈ నెల 15 నుంచి ఏపీలో ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బస్సు సౌకర్యం
ఈ పథకానికి అపూర్వ స్పందన వస్తుందన్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్
ఇప్పుడు తిరుమల కొండ పైవరకు కూడా ఈ సౌకర్యం వర్తింపు
అయితే ఘాట్ రోడ్డు కారణంగా సిటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామన్న కొనకళ్ల
ఈ నెల 15 నుంచి ఏపీలో ‘స్త్రీ శక్తి’ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్‌టీసీ బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని తిరుమల కొండ పైవరకు పొడిగించినట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. అయితే, ఘాట్ రోడ్డు కారణంగా సిటింగ్ వరకే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
నిన్న కృష్ణా జిల్లా అవనిగడ్డ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం కే వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘స్త్రీ శక్తి’-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన వస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16న 10 లక్షల మంది, 17న 15 లక్షల మంది, 18న 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని కొనకళ్ల నారాయణరావు చెప్పారు.
ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రోజుకు రూ. 6.30 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రధానంగా చిరు ఉద్యోగాలు చేసేవారు, ఆసుపత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు ఆయన పలువురు మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. ఆధార్ కార్డులు పరిశీలించి వారికి ఉచిత ప్రయాణ టికెట్లు అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.