నారద వర్తమాన సమాచారం
నరసరావుపేటలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్ అవగాహనా కార్యక్రమం
ప్రతి కుటుంబానికి రూ.3240 ఆదా
నరసరావుపేట,
జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులపై రూ.3240 ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని పల్నాడు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి. ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక మార్కెట్ సెంటర్‌లోని భవన్నారాయణ స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, జీఎస్టీ శాఖ, తూనికల కొలతల శాఖ, ఆహార భద్రత శాఖ సమన్వయంతో ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్, నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ కలసి ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గతంలో నాలుగు స్లాబులుగా (5%, 12%, 18%, 28%) ఉన్న జీఎస్టీని ఇప్పుడు రెండు స్లాబులకు (5%, 12%) తగ్గించడం జరిగిందని వివరించారు. వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద మార్పు చేసిన జీఎస్టీ స్లాబుల వివరాలను బోర్డులు ఏర్పాటు చేసి ప్రదర్శించాలని సూచించారు. దీని వల్ల వినియోగదారులు, వ్యాపారుల మధ్య వాగ్వివాదాలు ఉండవన్నారు. ఏ నిత్యావసర వస్తువు ఏ మేరకు ధర తగ్గిందో వినియోగదారుడికి స్పష్టంగా వివరించాలని, దీని వల్ల సమస్యలు ఉత్పన్నం కావని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా జీఎస్టీ-1 నరసరావుపేట మండల నోడల్ ఆఫీసర్ పున్నారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించేందుకు జీఎస్టీ 2.0ను తీసుకువచ్చాయన్నారు. తగ్గిన జీఎస్టీని అమలు చేయకుండా వ్యాపారస్తులు స్వలాభం కోసం వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ, చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ బాధ్యత తీసుకొని జీఎస్టీ 2.0 ద్వారా ఏ నిత్యావసర వస్తువు ఎంతెంత తగ్గాయో స్పష్టంగా వ్యాపార దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. జీఎస్టీ 2.0 అమలు పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 1137 విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవోలో జిల్లా స్థాయి కమిటీల కింద 31 శాఖల అధికారులను నియమించారని, వీరు జిల్లాలో నూతన జీఎస్టీ స్లాబులు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తారని వివరించారు. పర్యవేక్షణలో నూతన జీఎస్టీ స్లాబులను అమలు చేయని వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటారన్నారు. కాబట్టి, వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగ్గిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా క్రయవిక్రయాలు చేయాలని సూచించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వనమా సాంబశివరావు మాట్లాడుతూ, వ్యాపారస్తులు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన నూతన జీఎస్టీ పాలసీకి వ్యాపారస్తులు సంపూర్ణ సహకారం అందిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి, కే కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి పి సతీష్ కుమార్, వన్ టౌన్ కిరాణా మర్చంట్ అధ్యక్షులు పి శ్రీనివాసరావు, కార్యదర్శి కే శ్రీనివాసరావు, టూ టౌన్ కిరాణా మర్చంట్ అధ్యక్షులు డి విజయ్ కుమార్, కార్యదర్శి పంతంగి శ్రీనివాసరావు, వ్యాపారస్తులు, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.